Wednesday, 28 June 2017

కీమో.

    కీమో తో మన శరీరం లో ఎన్నో మార్పులు కలుగుతాయి. జుత్తు ఊడి పోతుంది, గోళ్ళు నల్లగా మారతాయి,
   తెల్లరక్తకణాలు తగ్గి పోతాయి. దీంతో వళ్ళంతా నొప్పులు, నీరసం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు
  ఎక్కువగా వుండే టట్లు చూసుకోవాలి. పప్పు,చేపలు, చికెన్, పల్లీలు,నట్స్,పాలు, పాలలో ప్రొటీన్ పౌడర్ వగైరా ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి ఆకులు నీటి లో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆకును తీసి ఆనీటిని
 తాగితే తెల్లరక్తకణాలు త్వరగా పెరుగుతాయట. చేదుగా వుంటాయి ఆకుపచ్చ గా వుంటాయి. రోజూ తాగాలి
 ఈమధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది పొప్పడిఆకుల వైద్యం.

       మొదటి సారి కీమో ఇవ్వగానే కొద్ది రోజుల లోనే తలలో ఏదో చిటపట మొదలవుతుంది. చిరాగ్గా వుంటుంది.
    మెల్లగా దువ్వెనతో కొంచెం కొంచెం జుట్టు ఊడుతున్నట్లు గమనిస్తాము. అలా రెండు రోజుల కు చాలా ఊడి
  మాడు కనిపిస్తుంది.  దానిని చూసి మనసు చెదరనీయొద్దు. ఇక లాభం లేదని మనమే పూర్తిగా గుండు చేయించడం మంచిది. తప్పదు. కొందరు ట్రీట్మెంట్ కన్నా ముందే గుండు చేయించుకుంటారు. తప్పని వాటికోసం
  బాధపడటం ఎందుకు?  మధ్యలో కూడా మరోసారి గుండు చేయిస్తే మంచిది.  కీమో అంటే ఒక్క సారితో పూర్తి
  అయ్యేది కాదు. కొందరికి మూడు వారాలకు ఒకసారి, కొందరికి వారం వారం కేసుని బట్టి డాక్టర్లు ప్లాన్ చేస్తారు.
  కీమోకి కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలు కూడా రాలిపోవడం తో మన మొహం మనకే చూడబుద్ది కాదు.
  అయినా పోరాటం చేయాలి. చచ్చే దాకా బ్రతకాలి గా. గెలిచే దాకా అలుపు లేని సంగ్రామం చేయాలి.
  గెలుస్తాము విజేతలవుతాము ఏమంటారు మిత్రులారా...

Tuesday, 27 June 2017

కీమో కాన్సర్ ట్రీట్మెంట్


     కాన్సర్ దశలను బట్టి, వచ్చిన చోటునిబట్టి,తీవ్రతని బట్టి ఆపరేషన్, రేడియేషన్, కీమోఅని మూడు
  విధాలుగా వైద్యం వుంటుంది.
 
  ముందు బ్లడ్ టెస్టు చేయించుకుని అన్నీ సరిగా వుంటే మరునాడు వుదయం ఫుల్ గా తిని నార్మల్ గా
  రోజు వేసుకునే మాత్రలు వేసుకొని వెళ్లి కీమో చేయించుకోవచ్చు. నా కైతే ఇలాగే చేశారు అందరికీ ఇలాగే
  చేస్తారో లేదో తెలీదు.  ముందు ప్రీ మెడిసిన్ ఇసస్తారు ఆ తరువాత కీమో మెడిసిన్ ఇస్తారు. ఇదంతా సెలైన్ ఎక్కించినట్లే వుంటుంది.  కంగారు ఏమీ లేదు. ఆందోళన అవసరం లేదు. ప్రశాంతంగా ముగించుకుని ఇంటికి
 రావచ్చు. మరునాడు కూడా ఏమీ కాదు కాస్త నీరసం.  రెండో రోజు మధ్యాహ్నం నుండి నా కైతే విపరీతమైన
 కాళ్ళ నొప్పులు వచ్చాయి.  నడుము కింద భాగం అంతా నొప్పి. ఇక కాళ్ళకు ఆయిల్ మసాజ్ చేయడం నొప్పి
 మాత్రలు వేసుకోవడం మామూలే. అయినా మూడు నుండి ఏడు రోజులు మాత్రం తగ్గలేదండి నాకు.
 ఆ తర్వాత మెల్ల మెల్లగా రోజు రోజు కు ప్రాణం పోసుకుంటున్నట్లు ఆరోగ్యం కుదుటపడుతుంది.  తొలి మూడు
 రోజులకు ఇచ్చిన మాత్రలతో నాలిక రుచిని కోల్పోయి ఏమీ తినలేక  ద్రవాహారంతోనే గడపడమైనది నాకు.

 కొందరికి ఒకటి రెండు వాంతులూ,మోషన్సో,పైల్సో,నోటి పూతో ఇలాగ ఏదో ఒకటి గానీ  మరోటి కలిసి గానీ
  జరగొచ్చు. కానీ, ఏమీ కాదు. ఇది తాత్కాలికమే అని మనకి మనం సర్దిచెప్పుకోవాలి. ధైర్యంగా వుండాలి.
 మనముందు ఎంతో మంది కోలుకుని చక్కగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వారిని చూసి మనం కూడా ధైర్యంగా
  ఆశగా అలా వారిలాగా ఎప్పుడు తిరుగుతామా అని ఆశావహంగా వుంటూ డాక్టర్లకి సహకరిస్తూ వీలయినంత వరకు నలుగురితో వుంటూ వుండాలి. ఒంటరిగా వుండవద్దు.  కనీసం అలా పక్కింటి కైనా వెళ్లి కాసేపుండి
 కబుర్లు చెప్పుకుని రావడం బాగుంటుంది. మంచి మంచి మందులు, మంచి డాక్టర్లు వున్నారు మనకు. జీవితం
 ఇపుడే ముగిసిపోవట్లేదు. మిత్రులారా అధైర్యపడవద్దు. ప్రతి రోజును ఆనందంగా గడపండి ప్రతి రోజును ఆస్వాదించండి సంగీతం తో. సాహిత్యం తో ప్రక్రుతి తో మీదైన లోకంలో .త్వరలోనే మనమూ మామూలు
 జీవితం గడపుతాము. 

Wednesday, 21 June 2017

మా అమ్మ కథ.

 
      ఆమెకి 85సంవత్సరాలు. గత సంవత్సరకాలంగా ఆమెకి మతిమరుపు వచ్చింది. పాతవిషయాలన్నీ గుర్తు కున్నాయి కానీ ఇప్పుడు మనమేంచెప్పినా వెంటనే మరచి పోతున్న ది .ఒకే ప్రశ్నని పదేపదే అడుగు తున్నది.  ఇల్లంతా సర్దుదామంటది. సరే అని వెళ్తే పనికిరాని సామానంతా పక్కనబెడితే అవన్నీమళ్లీ లోపల పెట్టేస్తుంది.  చిన్న గుడ్డపీలిక కూడా దాచిపెడుతున్నది.  ఏవస్తువు తనకి నచ్చినా చిన్నగా తీసుకెళ్లి తన రూంలో దాచిపెడుతున్నది.
తన బట్టలు కూడా ఎవరో తీస్తారని వాటిని ఒక బ్యాగులో పెట్టి దాన్ని మరో బ్యాగులో పెట్టి జిప్ లాగి గట్టిగా ముడి వేసి  దాని మీద శద్దరు,పైన టవలుకప్పి కబ్బోర్డు మూసి ఆపైన చిన్న నిచ్చెన నిలబెట్టి, రెండు కుర్చీలు అడ్డంగా పెట్టి
తలుపు వేసి ఇక ప్రశాంతంగా బైటికి వస్తుంది మాఅమ్మ. మచ్చుకు ఇదొకటి మాత్రమే ఇంకా ఇలాంటివి ఎన్నో.

Friday, 21 April 2017

పడమటర్ర.

   
     తాత,అమ్మమ్మలకు ఒక్కతేకూతురు అమ్మ .ఒకేఊరు. అమ్మమ్మ వాళ్ళిల్లు పాతబజారులో
    మాఇల్లుకొత్తబజారులో రోడ్డుకు దగ్గరగా వుండేది. వంటంతా ఇక్కడే. అమ్మమ్మ,తాతయ్యలు పొద్దున్నేచెలక,పొలం వ్యవసాయంఅంటూ వెళ్ళేవారు. వారికి సద్దిగిన్నెలు అన్నయ్యో,నేనో జీతగాళ్ళో
   తీసుకెళ్ళేవాళ్ళం.  సాయంత్రం కూడా సద్దిగిన్నెలు మాఇంట్లోంచి అమ్మమ్మ ఇంటికితీసుకెళ్ళేపని
   ఎక్కువగా నాకే వుండేది. ఆటైంలో నేనుఐదోతరగతో ఆరోతరగతో చదివేదాన్ననుకుంటా. అక్కడికి
   వెళ్లాలంటే చాలా వుత్సాహంగా వుండేది.

     అమ్మమ్మ పడమటర్రలో(గదిలో)బెల్లంకుండ వుండేది. మాకుతిరిగివచ్చేటపుడు చేతిమీద అరచేయి
    వెనుకవైపు నిమ్మకాయంత బెల్లం పెట్టి పంపేది. అదినాకుతూనాకుతూమాఇల్లు చేరేదాన్ని. అపుడపుడు
    అక్కయ్య కూడా తోడుగా వుండేది. ఆగది చీకటిగా గబ్బిలాలవాసనతో ఒక్కకిటికీ కూడాలేకుండా
     వుండేది. తడుముకుంటూ వెళ్లి బెల్లంకుండ ఎక్కడవుందీ కనిపెట్టేవాళ్ళం. మాతాతయ్య ఆయనజన్మించినసంవత్సరం(పింగళి) జన్మనామం వగైరా కాగితాలు,భూమికొన్న కాగితాలు ఎక్కడ
   ఎలా దాచేవారో తెలుసా ? లావాటి వెదురు కర్రల కణుపుల దగ్గర కట్ చేసి ఈకాగితాలు రోల్లాగా
   చుట్టి అందులో దూర్చి దానిపైమరో వెదురుబుర్ర తొడిగేవాడు. అందులో పేపర్లు వుంటాయని ఎవరూ
    ఊహించలేం కదా.
  
    ముఖ్యమైన సామానులన్నీ పడమటర్రలలోనే భద్రపరిచేది అమ్మమ్మ. గదినిండా కుండలూ,బానలూ,
    బస్తాలే . ధాన్యం, పప్పులు,బియ్యం,వడ్లు,ఉప్పుబస్తాలు,బెల్లంబుట్టలు,వేరుశనగలు,గోగునారతాళ్ళు,
     పశువులకు సంబంధించినసామాన్లు,పెద్దబోషాణం అందులోకొన్ని పట్టుచీరలు డబ్బులు ఇలా ఒకటేమిటి
    చీకట్లోఆగదిలోకెళ్తే కాళ్ళకువేళ్ళకు ఏవో తగుల్తూనే వుండేవి. దాదాపు 50 సంవత్సరాల గతం నామదిలో
    సజీవంగా నిక్షిప్తమై అపుడపుడు మలయమారుతంలా పలకరిస్తూనే వుంటుంది ఇలాగ.

Monday, 13 February 2017

అక్షరవనం



   నిన్ననేను ఒకమంచి కార్యక్రమానికి వెళ్ళాను .హైదరాబాదు నుండి రెండుగంటల ప్రయాణం కారులో. శ్రీశైలం వేళ్ళేదారిలో కల్వకుర్తి అనే ఊరిలో వందేమాతరం ఫౌండేషన్ వారి అక్షరవనం కార్యక్రమానికి వెళ్ళడంజరిగింది .మాధవరెడ్డిగారు తన స్వంతవ్యవసాయభూమిని, తన సమయాన్ని,తన పరివారం మొత్తంగా ఈప్రాజెక్టు పైనే వెచ్చిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు .ప్రభుత్వ పాఠశాలలనుండి పేద విద్యార్థులను తెచ్చి వారికి శిక్షణ ఇచ్చి వారిపై రీసెర్చి చేస్తూ భావి విద్యార్థులకు మేలైన విద్యను ఎలా అందించాలనే ఆలోచన ఆయనది. ఒక గ్రంధాలయం,ధ్యానమందిరం నిర్మాణంలో మాకుటుంబం పాలుపంచుకోవడం గర్వించదగిన విషయమని నేననుకుంటున్నాను. విశాలమైన వరండాలు,కూర్చోడానికి గ్రానైటుబెంచీలు,చుట్టూ మామిడిచెట్లు,చింతచెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్షరవనం రూపుదిద్దుకుంటున్నవైనం నన్నెంతో ఆకర్శిస్తూంది. వారి నినాదం చదవండి మరచిపోండి. బట్టీ విధానం కాకుండా చదువంటేభయంలేకుండా చేయడం. బడిపుస్తకాలు కాకుండా గ్రంధాలయంలోని పుస్తకాలు వారికిఅందుబాటులో వుంచి దాదాపు ప్రతి విద్యార్థి రెండువందల పుస్తకాలైనా చదవాలని,చదివినవి మెదడులో ఎక్కడో నిక్షిప్తమై వుంటాయనేవారి ఆలోచన బాగుంది. అలాగే పిల్లలే వంటచేయడం,అన్నిపనులు నేర్చుకోవడం వారికున్న నైపుణ్యాలుప్రదర్శించడం,వారే గురువులుగా మారిచెప్పడం, అన్ని విధాలుగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తున్నారక్కడ. గవర్నమెంటు టీచర్లు దాదాపు రెండువేలమంది ఇక్కడ ట్రైనింగు తీసుకుని వెళ్ళారంటే వీరి శ్రమ కృషి ఏపాటివో మనం అర్థం చేసుకోవాలి.  మాధవరెడ్డిగారి కుటుంబానికి,ఆ మహా యగ్నంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వారు ధన్యులు.

Friday, 6 January 2017

    ధన్యవాదాలు.


        గుండె గొంతుకలోన కొట్లాడుతోంది  తోవ తెలియక నాడు అల్లాడిపోయింది.
    
        చెప్పరే నా గొంతు ఎక్కడే దాగుంది  కూనిరాగాలు మౌన వీణంగ మార్చింది

      నా బంధుమిత్రువులు తోడుగా నిలిచారు  నాకోసమై వారు పరితపించారు

     ఎవ్వరే నాకిన్ని నీళ్ళు పోస్తోంది   చూడరే మారాకు చిగురు వేస్తోంది
  
     చాలదా ఇది నాకు బ్రతుకు భారాలేల  తిమిరంతో సమరాన గెలుపుభావాలెల్ల

     ధన్యవాదము చెప్ప నది చిన్నమాటాయె  వేరె దారిలేక రాతలే తోడాయె.

Tuesday, 27 December 2016

అమ్మా వనితా

!   
     అమ్మంటే. దేవత.ఈ పదంచాలదు  ఇంకా ఇంతకన్న విలువైన పదమేలేదా తెలుగులో .వెదకాలి!పుస్తకాల్ని తిరగేసి నిఘంటువుల్ని తిరుగతోడి,భాషాప్రవీణుల్ని సంప్రదించి ఆమెకు సముచిత సర్వోన్నత సగౌరవ పదం నేను పట్టుకోలేకపోయాను.

      నిస్వార్థజీవి  ఒంటరిపక్షి. ప్రేమతో తనపరివారాన్ని సంరక్షించుకొంటున్న ధీర. భర్త కోసం తల్లిదండ్రుల్నీ,అత్తమామల్నీ,బంధుమిత్రుల్నీ ,చిన్ననాటినేస్తాలైన కోళ్ళూ,కుక్కలూ,ఆవులూ చెట్లూ,పూలూ పళ్ళూ,లతలూ వీటితో తనకున్న బంధాలన్నీ త్రెంచుకుని కుసుమకోమలమైన హ్రిదయాన్ని కఠినంగాచేసుకుని ఆయన వెంట ఎంతోదూరం సునాయాసంగా వెళ్ళగలిగింది. ఇవన్నీ,వీరందరినీ వదిలి అల్లంతదూరాన ఎలావుండగలిగింది?  బహుశాఆతను అత్యంత ప్రేమగా చూసుకున్నాడేమో! వాటన్నింటినీ మరపించేంత మురిపించాడేమో.

     పిల్లలు   తన బుల్లి ప్రపంచంలోకి వచ్చాక ఇక జీవితంలో మరేమీ అక్కరలేదన్నంతగా వారిని పెంచేక్రమంలో తన అస్థిత్వాన్ని కోల్పోయినవైనం కూడా పట్టించుకోనంతగా మునిగిపోతుంది. లాలన పాలన,చదువులూ నిద్రలేనిరాత్రులూ  కోడి తన పిల్లల్ని రెక్కలలోదాచుకున్నట్లుగా తను పెంచుకున్నది. జీవితమంతా ఇలాగే తన కనుసన్నలలోనే వుండాలనుకుంటుందా పిచ్చిది. లోకంలో ఎలా జరుగుతోందో చూస్తూ కూడా తన ఇంట్లోఅలా కాదనే ఆశతోవుంటూ  పిల్లలమీద ప్రేమ చివరకు దేవుణ్ని,మాంత్రికుల్నీ,బాబాలను అందరినీ వేడుకుంటూ ఇక వారికి ఏఆపదా రాదన్న భరోసాతో పెంచుకుంటుంది.

     కాలం మనకోసం ఆగదుకదా! పెళ్ళిళ్ళు చేయాలి కని ఊరుకుంటే సరిపోదు ప్రయోజకుల్నీ చేయాలి మన పరిధుల్లో. ఆక్రమంలో మళ్ళీ తననుతాను మర్చిపోయి బాధ్యతలను అనుక్షణం గుర్తుచేసుకుంటూ వాటిని నెరవేర్చేటందుకు అహరహం శ్రమిస్తూ పూర్తిచేస్తుంది. ఆనక విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా రెండోతరం ఆటా పాటా ముద్దూమురిపాల కాలక్షేపాలతో  ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే హాయిగా నవ్వుతూ మరికొన్నాళ్ళు కాలంగడుస్తున్న సంగతేమరచిపోయింది.

     మెల్లగా  మళ్ళీ ఒంటరైపోతున్న భావన. ఆరోగ్యంకూడా దెబ్బతిన్నది. తననొకరు అనుక్షణం కనిపెట్టుకుని ఉండాల్సిన సమయంలో.  . తనతోడు రెట్టించిన ఉత్సాహంతో ఊపుతో వ్రుత్తిలో మునిగి అదే జీవితమనే భ్రమలోవుంటూ పనులచుట్టూ పరిభ్రమిస్తుంటే చూస్తూ నిస్సహాయగా,బేలగా నిలబడి జీవితప్రయాణాన్ని కొనసాగిస్తూ... ఇదికాదు జీవించడం,ఇదికాదు జీవితమంటే అని  అన్నీ తెలిసిన మనిషికి చెప్పలేక చెప్పీ ప్రయోజనంలేక అలా నిలబడిపోయింది.

    ఒకపువ్వు పరిమళం,ఒకమొక్క మారాకు,మనపూదోటకొచ్చిన సీతాకోకచిలుక వన్నెలు , పసివాని బోసినవ్వులు నడవలేకనడుస్తూ లేస్తూపడుతూ పడేఅగచాట్లు, మనల్నే నమ్ముకుని జీవిస్తున్న ప్రాణులూ, మన పరివారం మంచిచెడ్డలూ, సాయంసంధ్యలోని అందాలూ ఉదయకిరణ అనుభూతులూ పంచుకుంటూ పేపరు వార్తలు చర్చించుకుంటూ ఒకరికొకరుగా సేవలు అందిస్తూ సదానవ్వుతూ ఆరోగ్యంగా వుంటూ జీవించాలనే తపన తప్పుకాదుగా.

   ఓ వనితా నీవు లే . నీవు ఇంకా ఎదగాలి. అన్నీ నేర్చుకుని నేర్పుగాజీవించాలి. అందరినీ ధిక్కరించడమే ఎదగడంకాదు. కుటుంబసభ్యులను మెప్పిస్తూనే నీ ఉనికిని చాటుకో.  కస్టమే కానీ నీవు అనుకుంటే సాధించగలవు. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించగన్ తెలుసుగదా మనకు. అందుకే చిన్నప్పుడే అన్ని విద్యలు,కళలునేర్పించాలి మన చిన్నారులకు. త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా  ఇలాంటివి దాటి  పదండి ముందుకు పదండితోసుకు పదండి పోదాం పైపైకి.