Tuesday, 22 May 2018

చిన్నారి


  అమ్మమ్మా నేను విసరుతానుఅంటూ తనచిన్నిచేతులతో అమ్మమ్మ చేతిపై తనచేతినుంచి గుండ్రంగా కాస్త ముందుకు వంగుతూ తిప్పసాగింది పెసరపప్పు చేసేపనిలో చిన్నారి. అమ్మమ్మా నేనూ కోస్తాను నాకూ చిన్న కొడవలిలిక్కి ఇవ్వమ్మమ్మా అంటూ తీసుకొని జొన్న చేలో చేరి కొయ్యను కాస్తవంచి కంకులుకోసేసమయంలోఒకసారి వేలుకూడాకోసుకుని రక్తంకారింది. అయినా అలాగే చేయసాగింది చిన్నారి. జొన్న చేలో ఆకుపచ్చ గా పరచుకున్నతీగలకు పసుపు రంగు దోసకాయలపై ఎర్రసారలుపడిన కాయలూకోసింది అమ్మమ్మ తో పాటు.  కోస్తూకోస్తూ బాగా ఎర్రబడ్డకాయలు కరాకరా నమిలి ఎంతతియ్యగుందమ్మమ్మా అంటూఆనందించేది చిన్నారి.
  
   నాలుగు వైపులా గుంజలుపాతి పందిరి వేసి మంచెవేయించాడు తాతయ్య సద్దచేన్లో. అమ్మమ్మతోపాటూ గిన్నెలో సల్లన్నం లూజుగాకలుపుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకొని సద్దితీసుకొని చేతిలో వడిసేలతో చెలకవైపు సాగింది చిన్నారి. మంచెమీద ఓవారగాపోసిన గులకరాళ్ళనుండి ఒకటి తీసుకుని వడిసెలలో పెట్టి తిప్పుతూ ఒడుపుగా రైయ్యిమని విసిరిందిరాయి. కంకులు తింటున్న పిట్టలన్నీ ఒకేసారిగా లేసి రెక్కలార్చుతూ ఎగిరిపోతుంటే నిండుగా నవ్వింది చిన్నారి. పలుగురాళ్ళుఏరి నిప్పుల్లోపెట్టి మధ్యలో సద్దకంకులుపెట్టి కాల్చిఇస్తుంటే తిని అమ్మమ్మా ఎంత కమ్మగా వున్నయే ఈపాలకంకులు నువ్వూతిను నువ్వూతిను అంటూ నోట్లోపెట్టి చప్పట్లు చరిచింది చిన్నారి.

  వడ్లో  బియ్యమో  జొన్నలో చెరుగుతూ మధ్యలో అలసిపోయి చీరకొంగు పరచుకుని అలాపడుకున్న అమ్మమ్మ దగ్గర నుండి నశ్యంకాయడబ్బా కొట్టేసి గమ్మున ఏమెరుకలేనట్లు అక్కడే వుండేది కొంటె చిన్నారి. కాసేపు కునుకు తీసిన అమ్మమ్మ లేచి నశ్యంకాయడబ్బా దోలాడి బట్టలన్నీ దులిపి మరీ దొరకక ఓచేటలో రెండుమూలలకు కాసిన్ని వడ్లు పోసి అమ్మా ముత్యాలమ్మ తల్లి అంతా నీమాయేతల్లీ  ఈచేట నిలువుగా వూగితే నీమాయ  అడ్డంగా వూగితే మాపిల్లమాయ అని దంణ్డంపెట్టి చేటని రెండు వేళ్ళతో సుతారంగా మధ్యలో పట్టుకుని చూసేది.  అలా కాసేపు చూసి అంతా నీమాయే  నాడబ్బానాకివ్వు అంటూ వెంటబడితే కిలకిలా నవ్వుతూ ఎలా తెలిసిందబ్బా అంటూ అయోమయంలోనే ఇచ్చేది చిన్నారి.

Sunday, 18 February 2018

నేనేమి చేస్తున్నా ప్రక్రుతి మిత్రకి.


    ఈ ప్రక్రుతి కి నేనేమి చేస్తున్నా
   
    ఇంత అందమైన అనుభూతిని ఇస్తోంది

 ఈ నేలకి చెట్లకి నేనేమి చేస్తున్నా

   బ్రతకడానికి నాకు ఆహారమిస్తొంది

 ఈ కొమ్మపూబాలలకు నేనేమిచేస్తున్నా
  రకరకమ్ముల పూల పరిమళాలబ్బంది

  ఈ చిరు కీటకాలకు నేనేమిచేస్తున్నా
  భ్రమరనాదాలతో వీనులవిందు చేస్తున్నాయ్

  ఈ కోనేరు ,తటాకమునకేమిచేస్తున్నా
   జలకన్యలా తుళ్లింత పడుతోంది మనసు

  ఈ ప్రక్రుతి కినేనేమి చేస్తున్నా
  ఇంత అందమైన అనుభూతి నిస్తోంది

  ఈ జన్మలో నాకేదో సందేశాన్ని స్తున్నట్లు
అనిపిస్తోంది కదూ ఎవరినీఏమీ ఆశించకన్నట్లు.

Thursday, 12 October 2017

చిలిపి ఊహ.


    చెలీ  లేలేత సూర్యకిరణాలు తనువంతా స్పర్శిస్తూ ఆస్వాదిస్తూ నీవైపు నన్ను లాగుతున్న బలీయమైన
కారణమేదో తెలుసా?  షటిల్ ఆడుతున్న నన్ను నీవు ఒక్క సారైనా చూసి హాయ్ చెబుతావేమోనని చెమటలతో తడిసిన నామేను నీ పలకరింపుతో తడారిపోతుందని ,నీ రంగు పులిమిన అధరాలలోంచి వినీవినపడని
పదాలేవో అలా అలా అలవోకగా తేలి నావైపు పరుగులతో వస్తుంటాయని ఎంత ఆశగా వున్నానే...

   మొన్నామధ్య కలిసినప్పుడు ఎన్నిబాసలు చేసావు. ఎన్ని కబుర్లు చెప్పావు.  వారంలో ఒక సారైనా
బైట అలా చెట్టాపట్టాలేసుకుని తిరగాలని అనలేదూ!  ఒక సినిమా ఐనా చూద్దామని చెప్పలేదూ.  కాఫీడేలో
కాఫీతాగుతూ కబుర్లతో కాలక్షేపం చేస్తూ గడుపుదామని బాస చేయలేదూ.  ప్రియసఖీ అవన్నీ వట్టి మాటలేనా
నీటి మీద రాతలేనా  మరి నేనేమిటిలా  పిచ్చిదానిలా ప్రతిరోజూ నీవేదో నాకోసం పరితపిస్తున్నట్లుగా ఇలా
భ్రాంతి కలుగుతున్నదేమి?  ప్రేమంటే ఇద్దరికీ ఒకేసారి ఒకే భావన కలుగుతుంది అంటారుకదా !  నీకేమీ
లేదా  దేవుడా ! నాకెందుకిలా. 

   ఒక్క సారైనా ఒక్క రోజైనా ఆతలుపు తెరుచుకుంటుందని, కిటికీ ప్రక్కన వేచి చూస్తున్న నన్ను చూసి
ఆనందంతో గెంతులేస్తావని ఎన్ని ఊహలతో ఎన్నెన్ని జ్ఞాపకాలతో ఎంతకాలమని ఎదురుచూడను?
  ప్రియతమా! అయినా  అయినా నీపై నాకెందుకు కోపం రావడంలేదు తెలుసా?  నాలో వున్న ప్రతిభను
 నీవు మాత్రమే గుర్తించావని . దూరం నుంచే ఒక్క చిరునవ్వు, నీకరచాలనము, భావోద్వేగపూరిత
 వీక్షణం నీగవాక్షమునుండి నేనాశించడం నేరమా  కాదు కానేకాదు ఎవరెన్ని చెప్పినా నామనసు మొరా
యిస్తున్నది.  నిన్నువదిలి రాలేనంటున్నది మరిఎలా?

  అందుకే ఈపత్రలేఖనము. ప్రతి రోజూ నీఇంటివైపే చూస్తూ భావలోకాల్లో విహరిస్తూ ఎడబాటు భరిస్తూ
 అక్షరాక్షరాల్లో జీవిస్తూ... దేశదేశాలు దాటిన నాచెలి రాకకై  చకోరపక్షిలా..... నీ   మనోమంజరి.

Tuesday, 19 September 2017

ధర్మశాల

 
   ధర్మశాల  వెళ్ళి మందులు తెచ్చుకోవాలని ఎప్పటి నుండో అనుకున్నది గతవారం వెళ్లి వచ్చాము.
   డాక్టర్ కెల్సంగ్  టిబెటియన్ ఆయుర్వేద హాస్పిటల్ వుంది. మాకు తెలిసిన వారు చెప్పగా వెళ్లి
   వచ్చాము.  కీమో తర్వాత వెళ్దామని ఆగాము ఇన్నాళ్లు.  హైదరాబాద్ నుండి ధర్మశాల కు ఫ్లైట్ లో
   వెళ్లాము.  వుదయం ఆరుగంటలకు ఎక్కిన మేము ధర్మశాల లోని కాంగ్రా ఏర్పోర్ట్ చేరేసరికి మధ్యాహ్నం
రెండు అయింది.  అక్కడి నుండి టాక్సీ లో ఆరు కిలో మీటర్లు ప్రయాణించి హోటల్ కి చేరి లంచ్ చేసి
   లగేజీ రూంలో పెట్టి ఎదురుగానే వున్న హాస్పిటల్ కెళ్లాము .ఎటునడవాలన్నా ఎగుడుదిగుడుగా
   వుంది.  గుట్టలు చెట్లూ, పచ్చగా ఆహ్లాదంగా వాగులూవంకలూ, అక్కడక్కడా దూరంగా చిన్న ఇళ్ళు,
   సమతల భూభాగంలో పంటచేలతో మనోల్లాసం కలిగిస్తున్నాయి  పరిసరాలు.
  
      
       హాస్పటల్లో ముందుగా పేరు రాయించాలట ఆతర్వాత రిజిస్ట్రేషన్ చేయించాలట.  ఆ మనిషి
   ఎప్పుడు వస్తాడో తెలియదు. రాగానే చుట్టూ ఇరవైమందిదాకా మూగారు గుంపుగా. పేషంట్
   ఒరిజినల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వాలి అక్కడ.  మరునాటికి మన వంతు రావచ్చు డాక్టర్ ని కలవ
   డానికి. ఆరోజు వుదయం పట్టిన మూత్రం దాదాపు 120ml చిన్న బాటిల్ లో తీసుకుని వెళ్ళాలి.
    దాన్ని ఒక బౌల్లో పోసి కర్రపుల్లతోతిప్పి పారబోసి బాటిల్ పడేసి చేతులు శుభ్రంగా కడుక్కొని
    వచ్చి మన వివరాలు అడిగి మన ఫైలు చూసి మందులు రాసి ఇస్తాడు. బిల్లు పేచేసి మందులు
    తీసుకుని రావాలి. పక్కనే వున్న క్యాంటీన్ లో టీ తాగుతూ స్నాక్స్ తింటూ బెంచీలపై,కుర్చీ లపై
    కూర్చొని ఎదురు చూస్తుంటారు అందరూ. దాదాపు వంద మంది దాకా చూస్తాడు రోజూ డాక్టర్.
    రోజూ నాలుగు సార్లు వేసుకోవాలి మందు గోలీలు.  తినగూడనివేమిటో రాసి వుంటుంది.

        తిరుగుప్రయాణం సాయంత్రం వుందని  వుదయం ధర్మశాల సిటీ టూర్ వెళ్ళాం. వ్యూపాయింట్,
    చర్చి,సరస్సు, దలైలామా ప్రాంగణం చూసి వచ్చాము. ఓ ముప్పైనలభై మంది లామాలు కనిపించా
   రక్కడ. అదోలోకంలా వుంది.   దారి పొడవునా దుకాణాలు ఉన్నాయి. పూసలదండలూ,బుద్ధుని బొమ్మలు
    వగైరా.  బూట్లు, చెప్పులు చాలా చవక అనిపించాయి మాకు. అక్కడి ప్రజలు చాలా సౌమ్యంగా
    అనిపించారు.   ప్రక్రుతి సోయగాలు సంపూర్ణంగా ఆస్వాదిస్తన్న అనుభూతి కలిగింది.  ప్రతి బస్సు
    మీద దేవభూమి అని రాసుంది. నిజంగా దేవతలు నడయాడిన భూమే అనిపించింది.  షూస్ తీసుకుని
 వెళ్ళండి సౌకర్యంగా వుంటుంది ఒక వేళ మీరు వెళితే . 30% క్యాన్సర్ పేషంట్సే వస్తారు మిగతా వారంతా
    వివిధ రకాల రోగులు వస్తారు.

Saturday, 2 September 2017

విహారి


   ఒక చల్లని సాయంకాలం

అతి శీతల పవన సమీరం

   మా ప్రాంగణ నిలయ నివాసం

  ఆనంద సుమన విహారం


  శుకపిక శారి  "క" పోతము నై

 సు "మ"న విహార విహంగమునై

  తపోన్ముక్త మది సంచరినై

  స్వేచ్ఛా గాలుల మంజరినై


  తిరుగాడే కోనల కందమునై

  బ్రాహ్మీ ముహూర్తపు సమయాన

  సుకవి రచించిన గానమునై

  జనించె కవిత నా హ్రుదిన.

నా సిరి.

 
    చిరుగాలి లా నిను స్పర్శిస్తా

    గలగల సెలయేరయి వస్తా

    నేనేమిటో  నిరూపిస్తా

     అందరితో ఆహా అనిపిస్తా..


    ధ్యానం తో పొందిన కాంతి

    తరగని సిరి నా శాంతి

     గెలుపోటములు నాదరి చేరునా

     తెలిసిమసలుకో  నేస్తమా.

Wednesday, 28 June 2017

కీమో.

    కీమో తో మన శరీరం లో ఎన్నో మార్పులు కలుగుతాయి. జుత్తు ఊడి పోతుంది, గోళ్ళు నల్లగా మారతాయి,
   తెల్లరక్తకణాలు తగ్గి పోతాయి. దీంతో వళ్ళంతా నొప్పులు, నీరసం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు
  ఎక్కువగా వుండే టట్లు చూసుకోవాలి. పప్పు,చేపలు, చికెన్, పల్లీలు,నట్స్,పాలు, పాలలో ప్రొటీన్ పౌడర్ వగైరా ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి ఆకులు నీటి లో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆకును తీసి ఆనీటిని
 తాగితే తెల్లరక్తకణాలు త్వరగా పెరుగుతాయట. చేదుగా వుంటాయి ఆకుపచ్చ గా వుంటాయి. రోజూ తాగాలి
 ఈమధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది పొప్పడిఆకుల వైద్యం.

       మొదటి సారి కీమో ఇవ్వగానే కొద్ది రోజుల లోనే తలలో ఏదో చిటపట మొదలవుతుంది. చిరాగ్గా వుంటుంది.
    మెల్లగా దువ్వెనతో కొంచెం కొంచెం జుట్టు ఊడుతున్నట్లు గమనిస్తాము. అలా రెండు రోజుల కు చాలా ఊడి
  మాడు కనిపిస్తుంది.  దానిని చూసి మనసు చెదరనీయొద్దు. ఇక లాభం లేదని మనమే పూర్తిగా గుండు చేయించడం మంచిది. తప్పదు. కొందరు ట్రీట్మెంట్ కన్నా ముందే గుండు చేయించుకుంటారు. తప్పని వాటికోసం
  బాధపడటం ఎందుకు?  మధ్యలో కూడా మరోసారి గుండు చేయిస్తే మంచిది.  కీమో అంటే ఒక్క సారితో పూర్తి
  అయ్యేది కాదు. కొందరికి మూడు వారాలకు ఒకసారి, కొందరికి వారం వారం కేసుని బట్టి డాక్టర్లు ప్లాన్ చేస్తారు.
  కీమోకి కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలు కూడా రాలిపోవడం తో మన మొహం మనకే చూడబుద్ది కాదు.
  అయినా పోరాటం చేయాలి. చచ్చే దాకా బ్రతకాలి గా. గెలిచే దాకా అలుపు లేని సంగ్రామం చేయాలి.
  గెలుస్తాము విజేతలవుతాము ఏమంటారు మిత్రులారా...