Thursday 24 December 2020

అమ్మాయి అమ్మ కథ (గల్పిక తరువు )

 అమ్మా అమ్మా అంటూ పిలిచింది అమ్మాయి. అమ్మాయంటే చిన్నదేం కాదు అరవై ఏళ్ళుంటాయి ఆమెకు ' వాళ్ళమ్మకు ఎనభై ఏడు . ఎంత సేపు బైటికి రాకపోయే సరికి తలుపు తట్టి పిలిచింది. ఆం ఏందే అట్ల పిలుస్తున్నవు ఒకటే ... అంటూ వాష్ రూం నుండి బైటికి వచ్చింది . . ఇంత సేపు ఏం చేస్తున్నవు .. ఎవరి తో మాట్లాడుతున్నవు .. మాటలు వినపడు తున్నాయి నాకు ... అడిగిందిఅమ్మాయి . మా అమ్మతో మాట్లాడిన ' చానాల్లయింది మాఅమ్మ మాట్లాడక అంది . మీ అమ్మనా ఎక్కడుంది ఎప్పుడో పాయె ఇంకెక్కడుంది అంది వస్తున్న నవ్వును ఆపుకుంటూ . యాడికి బోయింది సూపిస్త పా అంటూ వాష్ రూంకి మళ్ళీ వెళ్ళింది. కుతూహలంగా వెంటే వెళ్ళిన అమ్మాయికి అద్దంలో తన బొమ్మ నే చూపిస్తూ అదేందే మా అమ్మ అంటూ చూపించింది . అర్ధం అయింది. తనకు ' అద్దంలో తన ప్రతి బింబమే వాళ్ళమ్మ అనుకుంటున్నది అని . సరేలే పద అన్నం తిందువుగానీ అంటూ తీసుకొచ్చి మరి మీ అమ్మ ఎటుపోయిందీ ... అని అడిగింది . మా అమ్మా ... ఎటు పోతది .. వాళ్ళింటికి పోయింది. నేనిటు రాంగనే  ఆమె అటు పోయింది. మాఇంటి చేద బాయికి రెండేపుల గిలకలు న్నాయి . నేను మంచి నీళ్ళ బిందెతో పోయ్యే సరికి మా అమ్మ గూడ మంచి నీళ్ళ కోసం వచ్చింది. ఇగ అక్కడ్నే చాలా సేపు మాట్లాడుకున్నాం అంది. ఆం ఆం సరేలే - రేపు నేనూ వస్తా నీతో అని సర్ది చెప్పిందిఅమ్మాయి . ఇరవై ఏళ్ళ కింద పోయిన అమ్మను ఇంకా తన మనసులో అప్పటి రోజుల్లోలాగా అలాగే ప్రతిష్ట చేసుకుంది మా అమ్మ . ఆ రోజులనుండి బైటికి రాలేక పోతున్న తల్లిని ప్రేమగా ఆర్తిగా దగ్గరికి తీసుకుంది అమ్మాయి .

Monday 27 July 2020

శేషప్రశ్న

  ఆత్మవంచన చేసి బ్రతికితి  ఆత్మఘోషను ఆపబోయితి
  అందరికి అనుకూలవతియను  పేరు కోసం ప్రాకులాడితి
  దినదినం మది సమరభావపు  అంగడిగ ఆందోళితైతిని
  మంచి మంచని ప్రాకులాడితి  ఎంచిచూడగ లుప్తమైతిని
 
  ఎంతకని నన్ను నేను  హింసపెడుతూ బ్రతుకుతుంటిని
  ఎవరికీ న్యాయమున  సమతూకమేయక నలుగుతుంటిని
  అయినూ నా ఉనికి కోసం  పడరాని పాట్లను మోయుచుంటిని
  వారువీరను భేదమేల  అందరికి నే చులకనైతిని

  శేషప్రశ్నగ మారెనా  నా కలల జీవనయానమా
  ఎన్ని వసంతాలీతీరుగా  నన్ను బ్రోవగనున్నవోగద
  ఎప్పుడూ మన ఇంటి తక్కెడ  అటుఇటూ పరుగెత్తుడేగద
  విధియే మాతో చెణుకులాడుట  తుంటరిగనే తోచెనకటా

  ఎందుకీనాడు నన్ను  బలహీనురాలను జేసెనో ఇలా
  రాబోవు రోజులు మంచివేమో  మరి ఎందుకీ కన్నీరు బేలా
   

Monday 25 May 2020

ఏల మరువను

టెకటెకా అంటూ పక్కింటిపిల్లల్తో వెన్నెల్లో దోబూచులాడింది చిన్నారి.
ఈనాటికీ నాకు మరపురాకున్నవి మనోయవనికపై చిత్రమైనిలిచాయి

అమ్మ పూజలు చేయ నాన్న టీ కై చూడ మధ్యలో నలిగింది నాటి చిన్నారి
సంప్రదాయపుపోరు ఆధునికపుతీరు రెండుచూసిన తాను నొప్పింపక
తానొవ్వకసూత్రాన్ని ఆనాడే ఒడిసిపట్టిన వైనమేల మరువను

నాన్న పక్కనకూచుని రేడియో రిపేరు చేస్తుంటే కావాల్సిన వందిస్తూ
ఆపాటలతో గొంతు కలిపి రాసుకున్న స్మృతులనేల మరువను

బేబీ అంటూ అమ్మీఅంటూఅనుక్షణం పిలిచే నాన్న నేడులేకున్నా నాటి
మమకార మాధుర్య వాత్స‌ల్యవారధిని ఎలా మరువనునేను ఎలా మరువను

రేగుపళ్ళుతెచ్చి ఒళ్ళోపోసే తాతరుమాల్లో పూలకొమ్మలు గుచ్చిఆటపట్టించి
చెంగుచెంగున దూకిచిటికెలో ఏమార్చె నాటి (నాటు)బుజ్జినినేను ఎలా మరువను

రోతీసూరత్అంటూఏడిపించే అక్క  చదువు పరీక్షలంటూ హెచ్చరించే అన్న
వారి స్నేహితులకు గారాల చెల్లినై ఇంటి నిండాగుంపు సందడంతా నాదే
ఏలమరువను నేను ఏలమరువను ఆనాటి ముచ్చట్లనేలమరువను
ఏలమరువను నేను ఏలమరువను చిననాటి ముచ్చట్లనేలమరువను

Saturday 18 April 2020

ఏడబోయినవురా

    ఒరేయ్ చిన్నోల్లచిన్నోడా ఎక్కడికి బోయినవురా
ఎన్నే ళ్ళయ్యిందిరా నిన్ను జూసి  మాయమైతివిగదరా మమ్ముమసిబూసి
ఏడబోయినవురా ఎప్పుడొస్తవురా

   ఉండరా కాసేపంటే మల్లొస్తనంటివి  తినరా అన్నమంటే బుక్కడే తింటివి
 అమ్మతో తినకుంటే బాధైతదంటివి  అరగంటకే అమ్మ రమ్మన్నదంటివి
ఆరేండ్లయినా మల్ల కానరాకుంటివి  ఏడబోయినవురా ఎప్పుడొస్తవురా

  గల్ఫ్ బేకరీలో కేకిష్టమంటివి  తీరతెచ్చేసరికి నువ్వెల్లిపోతివి
మీనాన్నకు కుడి భుజం లాగుంటివి  పెదనాన్నలకు పెద్ద దోస్తువైతిరిగితివి
పంచపాండవుల్లెక్క అన్నదమ్ములతోడ  ఆడుకుంటివిగదరా ఆరిందలాగా
ఏడబోయినవురా ఎప్పుడొస్తవురా

  బరువంతమోస్తనని ఆశజూపిస్తివి  నాలుగు గుంజలమీద బరువిడిసి పోతివి
ఏమిగావాల్నన్న నిన్నడగమంటివి  పెదవిదాటేలోగ పుడమిలోదాగితివి
కంటిధారలచార మాయనేలేదు  గొంతుదాటి మాటరాకనేపాయె
ఏడబోయినవురా ఎప్పుడొస్తవురా

  నీపెండ్లికి పూలకొప్పులనుకుంటిమి  నడుములకు వడ్డాణం హద్దులేదంటిమి
మాతరంలో చిన్నోడి పెండ్లి వైభవమిది  సరదసరదాలతో సంబరాలనుకుంటిమి
మీఅమ్మ కండ్లల్ల దీపాలు వెలగంగ  ఇంట్లజేరినవా బోసినవ్వులలో
ఇన్నేళ్ళ దిగులంత పరదసాటుకుతోసి  ఆటపాటలమాటు మాయజేసితివా
వెల్లొస్తివా నువ్వు మల్లొస్తివాకొడుక  ఇంటిదీపాలన్నీ వెలిగిస్తివా
ఏడబోయినవురా ఎప్పుడొస్తవురా

Saturday 9 November 2019

చిన్నప్పటి చిత్రాలు

గొరుకోలు పొడవంగలేసి ఎన్నోపనులుచేసుకుంది .పొయిసుట్టు ఎర్రమట్టితో అలికి ముగువేసి వత్తికుండనిండ నీల్లుబోసి పొయ్యిరాజేసింది. పక్కన చిన్న దాడిపొయ్యిమీద పాలకుండబెట్టింది.  కుండలో వండిన అన్నాన్ని జరంతపలుకుండంగనే నిన్న కడిగి పెట్టిన శిబ్బిపెట్టి అమాంతం దించి గుంతలో పెట్టిన గిన్నెలో గంజివొంచింది. కాసింతసేపైనంక కుండను తాటాకులతో చేసిన సుట్టకుదురు మీద పెట్టింది. ఆగంజితోనే బిడ్డకు  గోర్లకొట్టి తలకుబోసిందిసమాసిగ. గోలెంలనీల్లల్లో ఏరుశనగ శెక్క, ఉప్పు, గంజి అన్నీ ఏసింది కుడితికోసం.  ఇంటాయన పుట్టెడువడ్లుపోసుకుని పేటకుబొయ్యి అమ్ముకొస్తనని పోతాంటే దోతిగుడ్డని రెండుముక్కలుగా చిర్రున చీరి కిందపరచి రెండు ఇస్తరాకులుఏసి అందులో పుల్లవాసనతో పొడపొడలాడుతున్న అన్నంలో ఇంత మామిడికాయ తొక్కు పచ్చెన్న ఏసి పైనొకవిస్తారేసి మూటగట్టింది .ఈఅన్నం రెండురోజులయినా పాడుగాదు కలివల్ల.  స్టీలుటిపినీలో సల్లబోసిఇంత ఉప్పేసి బండికొయ్యకితగిలించింది. పిల్లకు నెత్తిన సమురురాసి పేలుజూసి సమాసిగజుట్టుదువ్వి బిర్రుగ జడేసింది.  సందకాడ పొలం నుంచి బరెగొడ్లు ఇంటికొచ్చినాయి.  బొచ్చెల్లో నానబెట్టిన దాన తెచ్చిపెట్టింది. ఆ దానలో ఏమేమి వున్నయో  మీకు జెప్పనా.  ఉలవలు,పెసల్లు, జొన్నలు, మక్కలు బొబ్బర్లు ఇసుర్రాయితో ఇసిరి బస్తలల్లనింపి రోజింత నీల్లుసల్లి ఉప్పేసి కలిపి పెడితే సందకాడికి నాని వుంటది. పొద్దున్నుంచి కష్టపడిన ఆవులు ఆవురావురని తింటయి. సందకాడ ఇంటిముంగల నీల్లుసల్లి ఊడ్చి మంచాలేసి పక్కలేసి వుంచుతారు జీతగాల్లు. పక్కమీద కూసోని రావుడూ భీవుడూ అంటూ పిలిస్తే దగ్గరకు వచ్చిన ఆవులను గంగడోలు నివురుతావుంటే ఎంతసేపైనా నిమిరిచ్చుకుంటనే వుంటయి. తర్వాత గుంజలకు కట్టేస్తే నెమరేసుకుంటావుంటాయి..   

Friday 13 September 2019

తొందరేల

,,ఎందుకంతతొందర ఇపుడేమయిందనీ
వుందిగా ముందర అంత ఒరవడెందుకనీ
నడిచొచ్చే తోవల్గో తుప్పలూ రాళ్ళూ ముళ్ళూ
వాటినే చూసావంటే సాగదుగా నీపయనం

 ఒక్కసారి ఏరిచూడు రాసబాట కాదామరి
ఆరాతిరాశిపొదల్లోనె వెతికిచూడరాదామరి
 రంగురాళ్ళ జాడలేమో రతనాలే దొరకునేమో
జీవితదారుల్లోదొరికేటి జ్ఞాపకాల సుమాలను
రతనాలవంటిస్నేహాలను మూటగట్టకోనలేమా

మన తదుపరి జీవికకై మంచిఅనే సువాసనలు
కొంతైనా పంచాలిగా ఇపుడైనా చేయాలిగా
ఆగుఆగు కనీసం ఒక్క సారి తిరిగి చూడు
నేనునేను నాదంటూ మొండికేసే తీరు చూడు

రాలేదా లేశమైన ఆధ్యాత్మిక భావజాలు
పోలేదా నిన్నటిఅనువంశిక భేషజాలు

Sunday 16 June 2019

పంచేంద్రియాలు

మా పాత స్నేహితుల్లో ఒకజంట షష్టిపూర్తిచేసుకుంటున్నారని వెళ్ళాం.  నిజంగా అద్భుతం మేము
 వెళ్ళకుండా వుంటే చాలా మిస్సయ్యేవాళ్ళం. మిగతా ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి గా ప్రయాణించి
అక్కడికి చేరుకున్న మాకు పవిత్రమైన కర్పూరపరిమళాలు మా నాసికాపుటాలకు సోకి అల్లంత
దూరంనుండేఆహ్వానించాయి. కారుదిగుతూనే దూరంగా ద్వారబంధాలకు పందిళ్ళకువేసిన
పుష్పమాలాలంకరణ నయనానందకరం. ఎదురొచ్చిన పాతమిత్రుల పలకరింపు కరస్పర్షలతో
తనువంతా పండింది ఎండలో. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో పాజిటివ్ ప్రకంపనాలు
వీనులగుండా లోలోపలికి ప్రసరించి పవిత్రతనతో ఆపాదమస్తకం అలరించింది. వారిచ్చిన
విందుభోజనాలు మా జిహ్వచాపల్యాన్ని చల్లార్చి జఠరాగ్నిపై నీళ్ళుచల్లి సంత్రుప్తి పరిచాయి.
ఇలా మా పంచేంద్రియాలను సంతుష్టపరిచిఆనందంగా ఇల్లు చేరాము.