Monday 23 July 2018

ఓ బిడ్డ కథ.

  ఆనూనె ఇసుంటబెట్టు అంటూ కాస్త చేతికి తీసుకుని నెమ్మదిగా కాళ్ళకు నూనె రాస్తూ... ఏందేఇదీ ఎన్నాళ్ళు ఇలా బాధపడుతవ్. ఇగ తగ్గదా బిడ్డా. మంచి డాక్టర్లు ఎవ్వరు లేరా.  ఇంకెక్కడన్నా ఎంతఖర్చయినా సూయించుకుందాము. దేశంలో ఎవ్వరు లేరానె దీన్ని బాగుజెయ్య. ఎంతో ఆవేదనగా అంటున్న తల్లికి  వారానికి రెండు సార్లన్నా ఇలా బాధపడుతున్న తనకు ఏంచెప్పాలి .

  తగ్గదమ్మా ఇద్దరు డాక్టర్లు ఇదే చెప్పారు. ఇక ఇంతే ఇట్లనే బతకాలి అంటూ నిట్టూర్పు విడిచింది అమ్మాయి. ఇలా ఎన్నిసార్లు చెప్పినా మరచిపోయి ఆ వాసినకాళ్ళను చూసినప్పుడల్లా బాధపడుతునేవుంటది. తనకొచ్చిన అనారోగ్యం చెప్పలేక తనకు క్యాన్సర్ అని, రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పి ఆముసలితల్లిని బాధపెట్టటం ఎందుకని లోలోపల మదనపడింది. ఏదో లేవే ఈమాత్రం తిరగగలుగుతున్నా. ఇంట్లో అందరికీ నా చేతనయినంతవరకూ సహకరిస్తున్న. నలుగురు పిల్లలు స్కూలుకు వెళ్ళొస్తరు. ముగ్గురు పనోళ్ళకువేళకింత పెట్టాలి. పనులు పురమాయించాలి. కొడుకులు కోడళ్ళు ఎవరిపనికివారు వెళ్తారు నన్ను నమ్ముకుని. వాళ్ళకి నాఅవసరం వుందో లేదో తెలియదు కానీ నేనైతే కాస్తో కూస్తో ఉపయోగపడుతున్నాననే అనుకుంటున్నాను. ఇక మీఅల్లుడు. ఏంచెప్పాలి ఎప్పుడూ ఫోను తోనే . నేను బాగనే వున్నననుకుంటడు. నామీద ఎంత నమ్మకం. ఆయన టెన్షన్ లు బిజినెస్ ముచ్చట్లు వినాలి. అమెజాన్ నుంచి ఏదో వస్తుంది తీసుకో అంటరు, కొరియర్ అంటూ ఎవరో వస్తారు. ఇంత ఇంట్లో ఎప్పుడూ ఏదో రిపేరు. నాకు చేతగాదురబాబూ అన్నా ఒక్క సారి పైఫ్లొరుకొచ్చి చూడండి మేడమ్ అంటారు. కింద కొమ్మలు కట్ చేయమంటే నున్నగా కొరిగేస్తరు నేను లేకుంటే. మద్యాహ్నం లంచ్ కి ఒక్కొక్కరు ఒకసారి వస్తారు చూస్తున్నావుగా.

   ఇక రోజుకు ఐదారు సార్లు నా మందులు వేసుకోవాలి. నాపాలిట వరమేంటంటే ఇంకా షటిల్ ఆడడం. పొద్దున్నే నీపాడ్స్ వేసుకుని డ్రెస్ ఛ్చేంజ్ చేసుకుని షూస్ వేసుకుని వెళ్ళొచ్చాక చీర , కాళ్ళకు స్టాకింగ్స్ వేసుకుని ఎన్నని చెప్పను. ఎవ్వరూ నొచ్చుకోకుండా ఎవరి భావోద్వేగాలు దెబ్బతినకుండా ఇంతమందిని కనిపెట్టుకుంటాను. ఏఇంట శుభకార్యం జరిగినా ఏ కార్యక్రమం వున్నా నేనే పోవాలి. ఎవరికీ తీరదుగా. అమ్మా జీవితం చాలా విలువైనది. దాని విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ కొద్ది సమయంలో  సమాజానికి, కుటుంబానికి, పరివారానికి ఏదో చేయాలని తపన. అందుకే అమ్మా నేను బ్రతకాలి. నాకు బ్రతకాలనుందమ్మా.  నా మనవడూ, మనవరాళ్ళూ దినదినప్రవర్దమానమౌతూ సహస్రదళపద్మాల్లా వికసిస్తుంటే చూడాలనుందమ్మా. కనీసం నువ్వు వున్నంతవరకైనా  నీకోసమైనా బ్రతకాలనుందమ్మా. నా బరువుని ఎవరిపై మోపనమ్మా అనుకుంటూ లోలోపల ఉబికి వస్తున్న నీటిని లోపలే అదిమి తనకు సేవచేస్తున్న తల్లికి మనసు లోనే వందవందనాలు సమర్పించుకుంటూ తడితో తరళాయితమైన కన్నులు తుడుచుకుంటూ లేచింది అక్కడి నుండి.

Monday 2 July 2018

మర్రిచెట్టు

 
   అదే అక్కడ కనబడుతోంది చూడండి మర్రిచెట్టు.  మర్రిచెట్టుకు ఊడలువేసి ఎంత బాగుంది.  చిన్నప్పుడు ఆ వూడలుపట్టుకొని ఉయ్యాలలూగిన రోజులు మరొకసారి మనోఫలకంపై తేలియాడింది.  శిశిరంపోయి ఆమని వచ్చేవేళయిందేమో ఆకులన్నీ నవవసంతానికి స్వాగతమంటూ లేలేత చిగురాకుపచ్చఆకులతో శాఖోపశాఖలుగా విస్తరించి ఉమ్మడి కుటుంబం లా చూపరులకు ఆనందాన్నిస్తున్నది.  దాని కింద సిమెంటు గట్టు రచ్చబండై ఎన్ని వివాదాల్ని పరిష్కరించిందో ఎన్నింటికి మూగసాక్షై నిలిచిందో. ఈచెట్టు ఇంట్లో వుంటే ఎంత బాగుండు కానీ వద్దంటారే అందరూ. 

  అదిగదిగో పిచ్చుకలు వైనవైనాలుగా కొమ్మకొమ్మకు ఎగురుతూ నన్ను వెక్కిరిస్తున్నాయి నీవు నాలాగా ఎగరలేవుగా అంటూ.  అమ్మో దాని మొదట్లో ఎన్నిఊడలు  దాని కైవారమెంతవెడల్పుగానున్నదో...అందులో ఆకలుగుల్లో  పాములున్నాయేమో...ఆ...వుంటే వుండనీగాక  మనలోమాత్రంలేరూ అంతకన్నా విషపునాగులూ. అందర్నీ కలుపుకుని పోవడమేగా జీవనయానం. ఏమంటారు.