Tuesday 22 May 2018

చిన్నారి


  అమ్మమ్మా నేను విసరుతానుఅంటూ తనచిన్నిచేతులతో అమ్మమ్మ చేతిపై తనచేతినుంచి గుండ్రంగా కాస్త ముందుకు వంగుతూ తిప్పసాగింది పెసరపప్పు చేసేపనిలో చిన్నారి. అమ్మమ్మా నేనూ కోస్తాను నాకూ చిన్న కొడవలిలిక్కి ఇవ్వమ్మమ్మా అంటూ తీసుకొని జొన్న చేలో చేరి కొయ్యను కాస్తవంచి కంకులుకోసేసమయంలోఒకసారి వేలుకూడాకోసుకుని రక్తంకారింది. అయినా అలాగే చేయసాగింది చిన్నారి. జొన్న చేలో ఆకుపచ్చ గా పరచుకున్నతీగలకు పసుపు రంగు దోసకాయలపై ఎర్రసారలుపడిన కాయలూకోసింది అమ్మమ్మ తో పాటు.  కోస్తూకోస్తూ బాగా ఎర్రబడ్డకాయలు కరాకరా నమిలి ఎంతతియ్యగుందమ్మమ్మా అంటూఆనందించేది చిన్నారి.
  
   నాలుగు వైపులా గుంజలుపాతి పందిరి వేసి మంచెవేయించాడు తాతయ్య సద్దచేన్లో. అమ్మమ్మతోపాటూ గిన్నెలో సల్లన్నం లూజుగాకలుపుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకొని సద్దితీసుకొని చేతిలో వడిసేలతో చెలకవైపు సాగింది చిన్నారి. మంచెమీద ఓవారగాపోసిన గులకరాళ్ళనుండి ఒకటి తీసుకుని వడిసెలలో పెట్టి తిప్పుతూ ఒడుపుగా రైయ్యిమని విసిరిందిరాయి. కంకులు తింటున్న పిట్టలన్నీ ఒకేసారిగా లేసి రెక్కలార్చుతూ ఎగిరిపోతుంటే నిండుగా నవ్వింది చిన్నారి. పలుగురాళ్ళుఏరి నిప్పుల్లోపెట్టి మధ్యలో సద్దకంకులుపెట్టి కాల్చిఇస్తుంటే తిని అమ్మమ్మా ఎంత కమ్మగా వున్నయే ఈపాలకంకులు నువ్వూతిను నువ్వూతిను అంటూ నోట్లోపెట్టి చప్పట్లు చరిచింది చిన్నారి.

  వడ్లో  బియ్యమో  జొన్నలో చెరుగుతూ మధ్యలో అలసిపోయి చీరకొంగు పరచుకుని అలాపడుకున్న అమ్మమ్మ దగ్గర నుండి నశ్యంకాయడబ్బా కొట్టేసి గమ్మున ఏమెరుకలేనట్లు అక్కడే వుండేది కొంటె చిన్నారి. కాసేపు కునుకు తీసిన అమ్మమ్మ లేచి నశ్యంకాయడబ్బా దోలాడి బట్టలన్నీ దులిపి మరీ దొరకక ఓచేటలో రెండుమూలలకు కాసిన్ని వడ్లు పోసి అమ్మా ముత్యాలమ్మ తల్లి అంతా నీమాయేతల్లీ  ఈచేట నిలువుగా వూగితే నీమాయ  అడ్డంగా వూగితే మాపిల్లమాయ అని దంణ్డంపెట్టి చేటని రెండు వేళ్ళతో సుతారంగా మధ్యలో పట్టుకుని చూసేది.  అలా కాసేపు చూసి అంతా నీమాయే  నాడబ్బానాకివ్వు అంటూ వెంటబడితే కిలకిలా నవ్వుతూ ఎలా తెలిసిందబ్బా అంటూ అయోమయంలోనే ఇచ్చేది చిన్నారి.