Saturday 22 December 2018

కోటి దీపోత్సవం.

మొన్నీమధ్య కోటిదీపోత్సవానికి ఎన్టీఆర్ స్టేడియానికీ వెళ్లొచ్చాను .నిజంగా ప్రతివాళ్లూ ఓసారి తప్పకుండా చూడాల్సిన వైభోగమది . .గతసంవత్సరం మాకాలనీవాళ్ళు దాండియాగ్రూపుగావెళ్లి చూసొచ్చి చాలాబాగుందని చెప్పారు .చాలా ఆర్గనైజ్డుగా చేస్తున్నారు తొక్కిసలాట తోపులాట లాంటివి ఏవి లేవనిచెప్పారు .ఓసారి చూడాల్సినదేనని ఈసారి వారితోపాటూ నన్నుతీసుకెళ్ళారు ముఖ్యంగా నాతోటికోడళ్లు .గ్రూపంతా ఒకేరకమైన చీరలు కట్టగా నేనూ అదేరంగుచీరకట్టుకొని వారితోపాటు వెళ్ళాను .గ్రూపువాళ్ళందరూ నన్నుసాదరంగా తోడ్కొనివెళ్ళారు ఆత్మీయంగాతొమ్మిదో రోజు .
అల్లంతదూరంనుండే కోటిదీపోత్సవం భక్తిటివి అంటూ కనబడుతున్నది ధగధగాయమానంగా వెలుగులువిరజిమ్ముతూ .ప్రాంగణంలో ఆంజనేయుడు దుర్గాదేవి నంది బొమ్మలు వున్నాయిఅక్కడక్కడ  .అదోలోకం అద్భుతలోకం సురలోకం .జనంజనం ప్రభంజనం ఎటుచూస్తేఅటు కిటకిటలాడుతున్నారు .ఈసారి బాగా వచ్చారు జనం అనిఅనుకుంటున్నారు .మమ్మల్నికాస్త ప్రత్యేకంగా బారీకేడ్లదారిగుండా వాలంటీర్లు పంపిస్తున్నారు. మాచేతిలో దాండియా కర్రలు మా అందరిదీ ఒకేరంగు చీరలు మహాగొప్పగా ఠీవిగా నడుస్తూ మాకుకేటాయించిన డయాసుదగ్గరికి చేరుకున్నాము .హమ్మయ్య ఇక్కడకాస్త ప్రశాంతంగా ఉందని మా గ్రూపులోని పిన్నిగారిని కూర్చోబెట్టి మా హ్యాండ్బ్యాగులూ ఆమెవద్దపెట్టాము .అలాంటి డయాసులు రకరకాల ఎత్తుల్లో కొలతల్లో అటూఇటూచాలానే వున్నాయి. దేవేరులిద్దరిమధ్య శ్రీవేంకటేశ్వరుడు తెల్లనిరాళ్ళుపొదిగిన విగ్రహాల్లో దేదీప్యమానంగా తళుకులీనుతూ భక్తులను పరవశింపచేస్తున్నాడు. మరోవైపు రెండు మూడు దొంతరలుగావున్న అతి పెద్ద డయాస్ మీద వెనుక వైపున చాలా పెద్దగా హిమశిఖరం పైన పరమశివుడు శివుని పై చంద్రవంకా ముందర ఎత్తైన శివలింగం మరోపక్క మంచు లింగం వుండి చూపుతిప్పుకోనివ్వట్లేదు. మాస్టర్ తన మూడు గ్రూపులతో దేవుని శావకి ముందు డమరుక నాదాలతో, వాయిద్యాలతో వున్న తోవలో దాండియాచేయిస్తూంటే అందులో భాగమైనాము .మామధ్యలోకి ఎవరూ రాకుండా అంతరాయం కలుగకుండా రెండు బారికేడ్లమధ్య వాలంటీర్స్ మమ్మల్ని అలా తీసుకెళ్లారు. ఎదురెదురు నిలబడి కోలాటం వేస్తూ నడుస్తూ వెళ్తున్నాము. మధ్యలో ఒకతను నడిచే దారి వుండటానికి అటూఇటూ నడుస్తునేవున్నాడు.  పీఠాధిపతి గారూ పారిశ్రామిక వేత్తలూ మా మధ్యలోంచివెళ్ళి శివలింగం ముందు దీపాల్ని వెలిగించారు . అలా అలా నిరంతరాయంగా 45 నిమిషాల సేపు ప్రాంగణం అంతా మలుపులు తిరుగుతూ దాండియాచేస్తునే వున్నాము.  చెమటలు పడుతున్నాయి దాహం వేస్తుంది కాళ్ళులాగుతున్నాయి అయినా ఏదో ఉత్సాహం .దాండియాచేస్తూ వెళ్తుంటే దారికి ఇరువైపులా బారులు తీరిన జనం వాళ్ళ ఫోన్లో వీడియోలు తీసుకుంటున్నారు. మంచినీళ్లు అందిస్తున్నారు మాకు .చాలదాఇదిమాకు ఇంకేం కావాలి. అహో పరమాద్భుతం. ఆతర్వాత దాండియాగ్రూపు మళ్ళీ ప్రధాన డయాస్ మీద కూడా తందనానా అహో అంటూ చేసారు. ఓవైపు ఆవులేగకు పాలిస్తున్న ద్రుశ్యం,మరోవైపు మహానంది.  మధ్యలో వేదపండితులు మంత్రోచ్చారణలతో శ్రీనివాసుని కల్యాణం చేసారు.  దేవతలంతా భూలోకం తరలివచ్చారా అన్నట్లుగా వుంది.  ఒకరిని మించి ఒకరం చేయాలనే ఆరాటం .డ్రోన్ లో వీడియో తీస్తున్నారు క్రేన్తో వీడియో తీస్తున్నారు .ఈ మాయలో అలసట మరచి ఆనందంగా వేస్తూవేస్తూ తిరిగి మా డయాస్ దగ్గరికి చేరాము.  కాసేపట్లో అందరూ దీపాలు వెలిగిస్తున్నారు . చాలా పెద్ద ప్లేటు మధ్యలో దీపం .ఇలాంటివి చాలా వున్నాయి వరుసగా. దొంతరలుగావున్న దీపాలు కూడా చాలా వున్నాయి వత్తులు వేసి నూనె వేసి రడీగా. నాగదీపాలట మూడు నాలుగు వున్నాయి. నాలుగు వరుసలుగా ఫ్రేమ్ చేసి దానికి ప్రమిదలు వెల్డ్ంగ్ చేసి ఓవైపు పాముపడగలాగా పైకిలేపి దానికి దీపాలు పెట్టి మధ్యలో ఒకతను నిలబడి తనపైకండువాతో రెండు వైపులా స్టాండ్కికట్టి మెడమీద వేసుకొని దాన్ని తిప్పుతూ వున్నాడు వెలుగుతున్న దీపాలతో.  ఇక అఘోరా వేశాలువేసినవాళ్ళు త్రిశూలం తో ఎగురుతూ తిరుగుతున్నారు . త్రిశూలం మధ్యదానిలోంచి వెలుగులు చిమ్ముతున్నాయి. ముచ్చటగా వుంది ద్రుశ్యం.

అప్పటి దాకా ధగధగాయమానంగా వెలుగుతున్న కరెంటుని ఆపేశారు. ఒక్కసారిగా భక్తులు తమతమ తావులలోని నూనె దీపాలు వెలిగిస్తున్నారు. శివతాండవం పాటలు పెద్దగా పెట్టారు . బ్రహ్మాండంగా తయారైవచ్చిన నర్తకీమణులు లయబద్దంగా నాట్యం చేస్తున్నారు. వారి ముందు మేము దొంతరదీపాలు పట్టుకుని నిలబడినాము. వారికి వెనుక వేంకటేశ్వరస్వామి పద్మావతీ అమ్మవార్ల అలంకరణలతో ఇద్దరు పిల్లలు నిలుచున్నారుపైన. మాఅందరి వెనక ఎత్తైన శివలింగం వుంది.  క్రేన్ బుట్టలో ఇద్దరు ఎక్కి పైకి వెళ్లి ఆ శివలింగం పైన పూలు చల్గుతున్నారు. పటాకులు పేల్చారు. మావెనుకవరుస నాట్యగత్తెలు కూడా పూలు దోసిళ్ళతో జల్లుతున్నారు.

ప్రాంగణం అంతా కర్పూర పరిమళాలు దీపాలపొగ ఓపెన్ ప్లేస్. చల్లని గాలులు ఆధ్యాత్మిక వాతావరణం శివతాండవ న్రుత్యాలు పాటలకి వళ్ళంతా కళ్ళే అయ్యాయి. శివోహం శివోహం అంటూ మనసు పాటపాడుకుంటున్నది. పరిపూర్ణ ఆనందం ప్రతివారికి ప్రసాదం గా అందింది. పట్టుపట్టి తీసుకెళ్ళిన నావాళ్ళందరికీ, గ్రూపు సభ్యులకు,గణేశ్ మాస్టర్ కి భక్తి టీవీ వారికి వందనాలు.