Saturday 9 November 2019

చిన్నప్పటి చిత్రాలు

గొరుకోలు పొడవంగలేసి ఎన్నోపనులుచేసుకుంది .పొయిసుట్టు ఎర్రమట్టితో అలికి ముగువేసి వత్తికుండనిండ నీల్లుబోసి పొయ్యిరాజేసింది. పక్కన చిన్న దాడిపొయ్యిమీద పాలకుండబెట్టింది.  కుండలో వండిన అన్నాన్ని జరంతపలుకుండంగనే నిన్న కడిగి పెట్టిన శిబ్బిపెట్టి అమాంతం దించి గుంతలో పెట్టిన గిన్నెలో గంజివొంచింది. కాసింతసేపైనంక కుండను తాటాకులతో చేసిన సుట్టకుదురు మీద పెట్టింది. ఆగంజితోనే బిడ్డకు  గోర్లకొట్టి తలకుబోసిందిసమాసిగ. గోలెంలనీల్లల్లో ఏరుశనగ శెక్క, ఉప్పు, గంజి అన్నీ ఏసింది కుడితికోసం.  ఇంటాయన పుట్టెడువడ్లుపోసుకుని పేటకుబొయ్యి అమ్ముకొస్తనని పోతాంటే దోతిగుడ్డని రెండుముక్కలుగా చిర్రున చీరి కిందపరచి రెండు ఇస్తరాకులుఏసి అందులో పుల్లవాసనతో పొడపొడలాడుతున్న అన్నంలో ఇంత మామిడికాయ తొక్కు పచ్చెన్న ఏసి పైనొకవిస్తారేసి మూటగట్టింది .ఈఅన్నం రెండురోజులయినా పాడుగాదు కలివల్ల.  స్టీలుటిపినీలో సల్లబోసిఇంత ఉప్పేసి బండికొయ్యకితగిలించింది. పిల్లకు నెత్తిన సమురురాసి పేలుజూసి సమాసిగజుట్టుదువ్వి బిర్రుగ జడేసింది.  సందకాడ పొలం నుంచి బరెగొడ్లు ఇంటికొచ్చినాయి.  బొచ్చెల్లో నానబెట్టిన దాన తెచ్చిపెట్టింది. ఆ దానలో ఏమేమి వున్నయో  మీకు జెప్పనా.  ఉలవలు,పెసల్లు, జొన్నలు, మక్కలు బొబ్బర్లు ఇసుర్రాయితో ఇసిరి బస్తలల్లనింపి రోజింత నీల్లుసల్లి ఉప్పేసి కలిపి పెడితే సందకాడికి నాని వుంటది. పొద్దున్నుంచి కష్టపడిన ఆవులు ఆవురావురని తింటయి. సందకాడ ఇంటిముంగల నీల్లుసల్లి ఊడ్చి మంచాలేసి పక్కలేసి వుంచుతారు జీతగాల్లు. పక్కమీద కూసోని రావుడూ భీవుడూ అంటూ పిలిస్తే దగ్గరకు వచ్చిన ఆవులను గంగడోలు నివురుతావుంటే ఎంతసేపైనా నిమిరిచ్చుకుంటనే వుంటయి. తర్వాత గుంజలకు కట్టేస్తే నెమరేసుకుంటావుంటాయి..   

Friday 13 September 2019

తొందరేల

,,ఎందుకంతతొందర ఇపుడేమయిందనీ
వుందిగా ముందర అంత ఒరవడెందుకనీ
నడిచొచ్చే తోవల్గో తుప్పలూ రాళ్ళూ ముళ్ళూ
వాటినే చూసావంటే సాగదుగా నీపయనం

 ఒక్కసారి ఏరిచూడు రాసబాట కాదామరి
ఆరాతిరాశిపొదల్లోనె వెతికిచూడరాదామరి
 రంగురాళ్ళ జాడలేమో రతనాలే దొరకునేమో
జీవితదారుల్లోదొరికేటి జ్ఞాపకాల సుమాలను
రతనాలవంటిస్నేహాలను మూటగట్టకోనలేమా

మన తదుపరి జీవికకై మంచిఅనే సువాసనలు
కొంతైనా పంచాలిగా ఇపుడైనా చేయాలిగా
ఆగుఆగు కనీసం ఒక్క సారి తిరిగి చూడు
నేనునేను నాదంటూ మొండికేసే తీరు చూడు

రాలేదా లేశమైన ఆధ్యాత్మిక భావజాలు
పోలేదా నిన్నటిఅనువంశిక భేషజాలు

Sunday 16 June 2019

పంచేంద్రియాలు

మా పాత స్నేహితుల్లో ఒకజంట షష్టిపూర్తిచేసుకుంటున్నారని వెళ్ళాం.  నిజంగా అద్భుతం మేము
 వెళ్ళకుండా వుంటే చాలా మిస్సయ్యేవాళ్ళం. మిగతా ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి గా ప్రయాణించి
అక్కడికి చేరుకున్న మాకు పవిత్రమైన కర్పూరపరిమళాలు మా నాసికాపుటాలకు సోకి అల్లంత
దూరంనుండేఆహ్వానించాయి. కారుదిగుతూనే దూరంగా ద్వారబంధాలకు పందిళ్ళకువేసిన
పుష్పమాలాలంకరణ నయనానందకరం. ఎదురొచ్చిన పాతమిత్రుల పలకరింపు కరస్పర్షలతో
తనువంతా పండింది ఎండలో. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో పాజిటివ్ ప్రకంపనాలు
వీనులగుండా లోలోపలికి ప్రసరించి పవిత్రతనతో ఆపాదమస్తకం అలరించింది. వారిచ్చిన
విందుభోజనాలు మా జిహ్వచాపల్యాన్ని చల్లార్చి జఠరాగ్నిపై నీళ్ళుచల్లి సంత్రుప్తి పరిచాయి.
ఇలా మా పంచేంద్రియాలను సంతుష్టపరిచిఆనందంగా ఇల్లు చేరాము.

Monday 13 May 2019

నాబలం

నువ్వేకదా నా బలం  నువ్వేకదా నా బలహీనత.
నువ్వే కదా  నేర్పావు నాలోఆత్మవిశ్వాసం
బేలనైన నన్ను ధీరవనితను చేసావు
తడేమిటి తంతోంది మనసు మాగాణి పారాలని
దేవుడో విధిరాతో తలరాతో ఎవరో ఏదో
మేలు చేయరామనకు అంతోఇంతో
తొందరపడి నేనెందుకు చింతచేయబూనాలి
ఎన్నోఇచ్చావు ఎన్నెన్నో చేసావు
నీకు చేయనాకులేని శక్తిని అరువుతెస్తున్నా
రోగాలతో సహవాసం చేయలేక చస్తున్నా
నా సు" మతి"కెన్ని సొట్టలో రాటుదేల జిందగిలో
ఆల్ఈజ్ వెల్ ఆల్ఈజ్ వెల్ అంటున్న గుండెగూటిలో
అయినా మదినిండా నీవిచ్చిన ధైర్యంతో
అలుపులేని పోరాటం గెలుపు తీరంవైపు పయనం.

Thursday 4 April 2019

గర్విత

 
   ఆమె పంతులు బిడ్డ. అప్పుడప్పుడే పంతులు పోయి సార్ వచ్చేరోజులవి. నలభై ఏళ్ళ క్రితం మాట. పదోతరగతి ఫేలయ్యి నాన్నతోపాటూ రాజాపేట వెళ్ళింది.  రూంకి వున్న కిటికీలోంచి స్కూలుకు వస్తూవెళుతూ వుండే పిల్లలు అదిగోరా సారుబిడ్డ అదిగో అంటూ తనను చూస్తుంటే ఎంతో గర్వంగా వుండేది ఆరోజుల్లో. 
   ఆతర్వాత పెళ్లి పిల్లలు ఎక్కడో బొగ్గు బావిలో శ్రీవారి ఉద్యోగం. పుట్టిన ఊరి నుండి ఎంతో దూరం ప్రయాణం. అత్తమామల ఇంట పెద్ద కోడలై బంధు జనానికి తలలో నాలుకై ఆత్మబంధువైన గర్వంతో హ్రిదయం ఉప్పొంగినవేళ తనెంత అద్రుష్టవంతురాలోనని మురిసింది.  ఇలా కొన్నాళ్లు గడిచాక మళ్ళీ చదవాలనే కోరిక బలీయమై పదిలో మిగిలిన సబ్జెక్టు, ఇంటరూ, ఎక్ట్సర్నల్లో డిగ్రీచేసింది శ్రీవారి సహకారం తో .పదితోనే ఆగిన తన స్నేహితురాళ్ళను తలచుకుని మళ్ళీ గర్వపడింది.  కొడుకు ని ఇంటర్  విజయవాడలో చేర్చి చిన్నోడితోపాటూ హైదరాబాదు మకాం మార్చింది ఉద్యోగం వదలుకుని. పిల్లల్ని చెరోదేశంపంపింది పైచదువులకి  .జీవితంలో హడావుడి కాస్త తగ్గింది.  ఇంటి ముందు శుభ్రం చేయించి షటిల్ ఆడటం మొదలెట్టింది పదిమందితో. ఈఆట ఆమె జీవితానికే అఖండ దీపం అవుతుందని నాడు అనుకోలేదు.  నేడు అరవైయ్యోపడిలో వున్నా ఆడగలుగుతున్నందుకు మరీమరీ గర్విస్తున్నది.  భర్తతో, మరదులతో,తోడికోడలుతో,కొడుకులతో ఇపుడు మనవడితో మనవరాళ్ళతో కూడా ఆడుతున్నందుకు ఎంతో గర్వంగా వుందామెకు.  ఆరోగ్యం చెక్ పెట్టినా ఆటంటే లేచొస్తుంది ప్రాణం. ఇంటి నిండా కొడుకులు కోడళ్ళు మనవడూ,మనవరాళ్ళూ ఎనభై ఆరేళ్ల మాత్రుమూర్తితోసహా పనివారూ పరివారం తోడుగా ఎంతో సంతోషంగా చక్కని కుటుంబ బంధాలతో మహా గర్వంగా గడుస్తున్నాయి రోజులు.  ఇక  ప్రశాంతంగా సంత్రుప్తగా ఎప్పుడైనా ఏమైనా ఈజీవనయానం ఇలా సాగితే చాలు.