Thursday 4 April 2019

గర్విత

 
   ఆమె పంతులు బిడ్డ. అప్పుడప్పుడే పంతులు పోయి సార్ వచ్చేరోజులవి. నలభై ఏళ్ళ క్రితం మాట. పదోతరగతి ఫేలయ్యి నాన్నతోపాటూ రాజాపేట వెళ్ళింది.  రూంకి వున్న కిటికీలోంచి స్కూలుకు వస్తూవెళుతూ వుండే పిల్లలు అదిగోరా సారుబిడ్డ అదిగో అంటూ తనను చూస్తుంటే ఎంతో గర్వంగా వుండేది ఆరోజుల్లో. 
   ఆతర్వాత పెళ్లి పిల్లలు ఎక్కడో బొగ్గు బావిలో శ్రీవారి ఉద్యోగం. పుట్టిన ఊరి నుండి ఎంతో దూరం ప్రయాణం. అత్తమామల ఇంట పెద్ద కోడలై బంధు జనానికి తలలో నాలుకై ఆత్మబంధువైన గర్వంతో హ్రిదయం ఉప్పొంగినవేళ తనెంత అద్రుష్టవంతురాలోనని మురిసింది.  ఇలా కొన్నాళ్లు గడిచాక మళ్ళీ చదవాలనే కోరిక బలీయమై పదిలో మిగిలిన సబ్జెక్టు, ఇంటరూ, ఎక్ట్సర్నల్లో డిగ్రీచేసింది శ్రీవారి సహకారం తో .పదితోనే ఆగిన తన స్నేహితురాళ్ళను తలచుకుని మళ్ళీ గర్వపడింది.  కొడుకు ని ఇంటర్  విజయవాడలో చేర్చి చిన్నోడితోపాటూ హైదరాబాదు మకాం మార్చింది ఉద్యోగం వదలుకుని. పిల్లల్ని చెరోదేశంపంపింది పైచదువులకి  .జీవితంలో హడావుడి కాస్త తగ్గింది.  ఇంటి ముందు శుభ్రం చేయించి షటిల్ ఆడటం మొదలెట్టింది పదిమందితో. ఈఆట ఆమె జీవితానికే అఖండ దీపం అవుతుందని నాడు అనుకోలేదు.  నేడు అరవైయ్యోపడిలో వున్నా ఆడగలుగుతున్నందుకు మరీమరీ గర్విస్తున్నది.  భర్తతో, మరదులతో,తోడికోడలుతో,కొడుకులతో ఇపుడు మనవడితో మనవరాళ్ళతో కూడా ఆడుతున్నందుకు ఎంతో గర్వంగా వుందామెకు.  ఆరోగ్యం చెక్ పెట్టినా ఆటంటే లేచొస్తుంది ప్రాణం. ఇంటి నిండా కొడుకులు కోడళ్ళు మనవడూ,మనవరాళ్ళూ ఎనభై ఆరేళ్ల మాత్రుమూర్తితోసహా పనివారూ పరివారం తోడుగా ఎంతో సంతోషంగా చక్కని కుటుంబ బంధాలతో మహా గర్వంగా గడుస్తున్నాయి రోజులు.  ఇక  ప్రశాంతంగా సంత్రుప్తగా ఎప్పుడైనా ఏమైనా ఈజీవనయానం ఇలా సాగితే చాలు.

No comments:

Post a Comment