Thursday 24 December 2020

అమ్మాయి అమ్మ కథ (గల్పిక తరువు )

 అమ్మా అమ్మా అంటూ పిలిచింది అమ్మాయి. అమ్మాయంటే చిన్నదేం కాదు అరవై ఏళ్ళుంటాయి ఆమెకు ' వాళ్ళమ్మకు ఎనభై ఏడు . ఎంత సేపు బైటికి రాకపోయే సరికి తలుపు తట్టి పిలిచింది. ఆం ఏందే అట్ల పిలుస్తున్నవు ఒకటే ... అంటూ వాష్ రూం నుండి బైటికి వచ్చింది . . ఇంత సేపు ఏం చేస్తున్నవు .. ఎవరి తో మాట్లాడుతున్నవు .. మాటలు వినపడు తున్నాయి నాకు ... అడిగిందిఅమ్మాయి . మా అమ్మతో మాట్లాడిన ' చానాల్లయింది మాఅమ్మ మాట్లాడక అంది . మీ అమ్మనా ఎక్కడుంది ఎప్పుడో పాయె ఇంకెక్కడుంది అంది వస్తున్న నవ్వును ఆపుకుంటూ . యాడికి బోయింది సూపిస్త పా అంటూ వాష్ రూంకి మళ్ళీ వెళ్ళింది. కుతూహలంగా వెంటే వెళ్ళిన అమ్మాయికి అద్దంలో తన బొమ్మ నే చూపిస్తూ అదేందే మా అమ్మ అంటూ చూపించింది . అర్ధం అయింది. తనకు ' అద్దంలో తన ప్రతి బింబమే వాళ్ళమ్మ అనుకుంటున్నది అని . సరేలే పద అన్నం తిందువుగానీ అంటూ తీసుకొచ్చి మరి మీ అమ్మ ఎటుపోయిందీ ... అని అడిగింది . మా అమ్మా ... ఎటు పోతది .. వాళ్ళింటికి పోయింది. నేనిటు రాంగనే  ఆమె అటు పోయింది. మాఇంటి చేద బాయికి రెండేపుల గిలకలు న్నాయి . నేను మంచి నీళ్ళ బిందెతో పోయ్యే సరికి మా అమ్మ గూడ మంచి నీళ్ళ కోసం వచ్చింది. ఇగ అక్కడ్నే చాలా సేపు మాట్లాడుకున్నాం అంది. ఆం ఆం సరేలే - రేపు నేనూ వస్తా నీతో అని సర్ది చెప్పిందిఅమ్మాయి . ఇరవై ఏళ్ళ కింద పోయిన అమ్మను ఇంకా తన మనసులో అప్పటి రోజుల్లోలాగా అలాగే ప్రతిష్ట చేసుకుంది మా అమ్మ . ఆ రోజులనుండి బైటికి రాలేక పోతున్న తల్లిని ప్రేమగా ఆర్తిగా దగ్గరికి తీసుకుంది అమ్మాయి .