Saturday 27 August 2016

మాఇల్లు మాచెట్లు.

   
   నల్గొండ జిల్లా,తుంగతుర్తి నియోజకవర్గం, మండల్ నూతనకల్ మాఊరు.మానాన్న,మామామయ్య,మాఅత్తయ్య ముగ్గురూ ఆ స్కూలులో టీచర్లు..ఆస్కూలు పక్కనే మాఇల్లు.

   నా చిన్నప్పుడు1970లలో మాఇంటిముందు యూకలిప్టస్,సన్నజాజి,కాగితంబఠాణీ    ఇంటిప్రక్కన కరివేపాకు,జామ,బొప్పాయి...అటుప్రక్కన నిమ్మ,బత్తాయి,దానిమ్మ,సీతాఫలం,బొడ్దుమల్లె,వేపచెట్లు,దొబ్బనిమ్మచెట్లు పెద్దగా పెరిగి మాకు నీడనిచ్చి. తోడుగా నిలిచాయి.మాతాతయ్య పెట్టించాడట ఆచెట్లని.

   పెద్ద ఇల్లూ స్కూలు పక్కనే ఉండటం,నాన్న టీచరూ,మాఇంట్లో కరెంటూవున్నందున నా ఫ్రెండ్స్,అక్కయ్య ఫ్రెండ్స్,అన్నయ్య ఫ్రెండ్స్ ఇంట్లో చాలా మందే ఉండి చదువుకునేవారు.జామచెట్టు కొమ్మలపై తలాఒకవైపు ఒరిగి బట్టీపట్టేవాళ్లం పాఠాలని.ప్రశ్నలకు జవాబులు ఒకరికొకరంఒప్పగించుకునేవాళ్లం. జామ లేతచిగురులో చింతపండు కలిపి నోట్లో పెట్టుకుని అలా చప్పరిస్తూ ఆనందించేవాళ్లం.

    నిమ్మచెట్టుకింద ఊడ్చి చాపలేసుకుని కూర్చుని కథలూ  కబుర్లూ చెప్పుకునేవాళ్లం.మధ్యాహ్నం రెండు మూడు గంటలసేపు ఇలా గడిచేది ఆదివారాల్లో,సెలవుల్గో. తుమ్మజిగురు తీసి ఒక సీసాలో దాచుకునేవాళ్లం.అగరుబొట్టు తయారు చేసేవాళ్లం.బొడ్డుమల్లె చెట్టుచుట్టూ తిరుగుతూ తెలుగుపద్యాలు కంఠస్తం చేసేవాళ్లం.పూరెక్కలు ఒక్కొక్కటి తీసి కాస్తనలిపి గాలిఊది ఎదుటివారి నుదుట చిటుక్కునకొట్టి టప్మనే శబ్దం రాగానే నవ్వుకొనేవాళ్లం.

    మాఇంటి ప్రాంగణంలో ఉప్పుబేరలు ఆడటం,ఇంటివెనుక ఒకగ్రూప్,ఇంటిముందు ఒకగ్రూప్ ఇసుకతో సన్నాయికుప్పలు ఆడేవాళ్లం.ఆకులకింద కూడాకుప్పలు పోసేవాళ్లం.లేదంటే బొగ్గుతో చుక్కలుపెట్టేవాళ్లం.

    బోగన్విల్లాపూలు అదేనండీ కాగితంపూలు పెద్దపెద్ద కొమ్మలుగా పూసేవి .వాటిని విరిచి మాతాతయ్య రుమాలులో తనకు తెలియకుండాగుచ్చేదాన్ని.చెలక దగ్గరకి అలా వెళ్తుంటే దారిలో అందరూ నవ్వుతుంటే గాని తెలిసి నవ్వేవాడట. రుమాలులో ఇంటికి వచ్చేటప్పుడు మాకోసం ఈత పళ్లు తెచ్చేవాడు.

    యూకలిప్టస్ ని అప్పుడు జమాయిల్ చెట్టు అనేవారంతా.ఊరంతటికీ ఒక్కమాఇంట్లోనే ఉండేదిఆచెట్టు.దాని ఆకులకై అందరూ మాఇంటికి వచ్చేవారు. పంటితీపు,తలనొప్పి,మాడుపోటుకు దీనిఆకులు వాడేవారు. మాతమ్ముడైతే పైసా రెండుపైసలకు అమ్మేవాడు.ఆపిల్లలు ఎందుకు కొనేదో ఇప్పటికీ అర్థం కాదు.

    ఇలా ఒక్కోచెట్టుతో నా అనుబంధం ఒక్కోకథలా నామదిలో నిక్షిప్తమైంది.ఆ ఫ్రెండ్స్ లోఒక కుటుంబమే తదుపరి నా కుటుంబమవడంతో అపుడపుడూ గుర్తుచేసుకుని ఆనందిస్తాము.చెట్లతో నా అనుబంధం మీతో పంచుకోవాలనే కోరిక రోజురోజుకూ పెరిగి ఇలా మీముందు పొందుపరిచాను.

Thursday 4 August 2016

మానసి

         చిట్టితల్లీ ఎక్కడపుట్టావు ఎక్కడికి చేరావు.ఇది నీ అద్రృష్టమా లేక నాదా.  నీచిన్నిచేతులతో నా కెన్ని పనులు చేయాలని వచ్చావే.బహుశా నీకు తెలీదు లో కం పోకడ.అమ్మ నీడలొంచిదూరం పోతే లోకమెంత ని ర్దయురాలో

       ఎనీమియాతో వున్న నీచేతులు చల్లగా నా నుదురుపై అమృతాంజన్ రుద్దుతూంటే ఎంత హాయిగా వుందే నాకు. ఆటలాడి వచ్చిన నా కాళ్ల నొప్పులకు నీ మృదుకరస్పర్శతో విశ్రాంతి నిచ్చావు.

       ఎవరూ లేరని ఒంటరిగా కుములుతున్న నన్ను నేను లేనా అమ్మా  అంటూ ఎదురు ప్రశ్న వేశావు.విధి చేతిలో మేము విలవిల లాడినపుడు మౌనంగా మాకు ఆలంబనవైనావు.

      స్థబ్దంగా నడుస్తున్న మా జీవితాలలో నీపద మువ్వల సవ్వడితో జీవం పోసావు. అలసి సొలసి నిర్వేదనకు లోనైనపుడు నీ అమాయకపు నవ్వులతో మైమరపించావు.

       నా శ్వాస లో నా ధ్యాసలో నా ప్రతి కదలిక లో నా తోడువై నీడవై వున్న నీకు ఏమివ్వను తల్లీ నీ రుణమెలా తీర్చుకోనే నా మానస పుత్రీ.