Saturday 9 November 2019

చిన్నప్పటి చిత్రాలు

గొరుకోలు పొడవంగలేసి ఎన్నోపనులుచేసుకుంది .పొయిసుట్టు ఎర్రమట్టితో అలికి ముగువేసి వత్తికుండనిండ నీల్లుబోసి పొయ్యిరాజేసింది. పక్కన చిన్న దాడిపొయ్యిమీద పాలకుండబెట్టింది.  కుండలో వండిన అన్నాన్ని జరంతపలుకుండంగనే నిన్న కడిగి పెట్టిన శిబ్బిపెట్టి అమాంతం దించి గుంతలో పెట్టిన గిన్నెలో గంజివొంచింది. కాసింతసేపైనంక కుండను తాటాకులతో చేసిన సుట్టకుదురు మీద పెట్టింది. ఆగంజితోనే బిడ్డకు  గోర్లకొట్టి తలకుబోసిందిసమాసిగ. గోలెంలనీల్లల్లో ఏరుశనగ శెక్క, ఉప్పు, గంజి అన్నీ ఏసింది కుడితికోసం.  ఇంటాయన పుట్టెడువడ్లుపోసుకుని పేటకుబొయ్యి అమ్ముకొస్తనని పోతాంటే దోతిగుడ్డని రెండుముక్కలుగా చిర్రున చీరి కిందపరచి రెండు ఇస్తరాకులుఏసి అందులో పుల్లవాసనతో పొడపొడలాడుతున్న అన్నంలో ఇంత మామిడికాయ తొక్కు పచ్చెన్న ఏసి పైనొకవిస్తారేసి మూటగట్టింది .ఈఅన్నం రెండురోజులయినా పాడుగాదు కలివల్ల.  స్టీలుటిపినీలో సల్లబోసిఇంత ఉప్పేసి బండికొయ్యకితగిలించింది. పిల్లకు నెత్తిన సమురురాసి పేలుజూసి సమాసిగజుట్టుదువ్వి బిర్రుగ జడేసింది.  సందకాడ పొలం నుంచి బరెగొడ్లు ఇంటికొచ్చినాయి.  బొచ్చెల్లో నానబెట్టిన దాన తెచ్చిపెట్టింది. ఆ దానలో ఏమేమి వున్నయో  మీకు జెప్పనా.  ఉలవలు,పెసల్లు, జొన్నలు, మక్కలు బొబ్బర్లు ఇసుర్రాయితో ఇసిరి బస్తలల్లనింపి రోజింత నీల్లుసల్లి ఉప్పేసి కలిపి పెడితే సందకాడికి నాని వుంటది. పొద్దున్నుంచి కష్టపడిన ఆవులు ఆవురావురని తింటయి. సందకాడ ఇంటిముంగల నీల్లుసల్లి ఊడ్చి మంచాలేసి పక్కలేసి వుంచుతారు జీతగాల్లు. పక్కమీద కూసోని రావుడూ భీవుడూ అంటూ పిలిస్తే దగ్గరకు వచ్చిన ఆవులను గంగడోలు నివురుతావుంటే ఎంతసేపైనా నిమిరిచ్చుకుంటనే వుంటయి. తర్వాత గుంజలకు కట్టేస్తే నెమరేసుకుంటావుంటాయి..