Tuesday 27 December 2016

అమ్మా వనితా

!   
     అమ్మంటే. దేవత.ఈ పదంచాలదు  ఇంకా ఇంతకన్న విలువైన పదమేలేదా తెలుగులో .వెదకాలి!పుస్తకాల్ని తిరగేసి నిఘంటువుల్ని తిరుగతోడి,భాషాప్రవీణుల్ని సంప్రదించి ఆమెకు సముచిత సర్వోన్నత సగౌరవ పదం నేను పట్టుకోలేకపోయాను.

      నిస్వార్థజీవి  ఒంటరిపక్షి. ప్రేమతో తనపరివారాన్ని సంరక్షించుకొంటున్న ధీర. భర్త కోసం తల్లిదండ్రుల్నీ,అత్తమామల్నీ,బంధుమిత్రుల్నీ ,చిన్ననాటినేస్తాలైన కోళ్ళూ,కుక్కలూ,ఆవులూ చెట్లూ,పూలూ పళ్ళూ,లతలూ వీటితో తనకున్న బంధాలన్నీ త్రెంచుకుని కుసుమకోమలమైన హ్రిదయాన్ని కఠినంగాచేసుకుని ఆయన వెంట ఎంతోదూరం సునాయాసంగా వెళ్ళగలిగింది. ఇవన్నీ,వీరందరినీ వదిలి అల్లంతదూరాన ఎలావుండగలిగింది?  బహుశాఆతను అత్యంత ప్రేమగా చూసుకున్నాడేమో! వాటన్నింటినీ మరపించేంత మురిపించాడేమో.

     పిల్లలు   తన బుల్లి ప్రపంచంలోకి వచ్చాక ఇక జీవితంలో మరేమీ అక్కరలేదన్నంతగా వారిని పెంచేక్రమంలో తన అస్థిత్వాన్ని కోల్పోయినవైనం కూడా పట్టించుకోనంతగా మునిగిపోతుంది. లాలన పాలన,చదువులూ నిద్రలేనిరాత్రులూ  కోడి తన పిల్లల్ని రెక్కలలోదాచుకున్నట్లుగా తను పెంచుకున్నది. జీవితమంతా ఇలాగే తన కనుసన్నలలోనే వుండాలనుకుంటుందా పిచ్చిది. లోకంలో ఎలా జరుగుతోందో చూస్తూ కూడా తన ఇంట్లోఅలా కాదనే ఆశతోవుంటూ  పిల్లలమీద ప్రేమ చివరకు దేవుణ్ని,మాంత్రికుల్నీ,బాబాలను అందరినీ వేడుకుంటూ ఇక వారికి ఏఆపదా రాదన్న భరోసాతో పెంచుకుంటుంది.

     కాలం మనకోసం ఆగదుకదా! పెళ్ళిళ్ళు చేయాలి కని ఊరుకుంటే సరిపోదు ప్రయోజకుల్నీ చేయాలి మన పరిధుల్లో. ఆక్రమంలో మళ్ళీ తననుతాను మర్చిపోయి బాధ్యతలను అనుక్షణం గుర్తుచేసుకుంటూ వాటిని నెరవేర్చేటందుకు అహరహం శ్రమిస్తూ పూర్తిచేస్తుంది. ఆనక విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా రెండోతరం ఆటా పాటా ముద్దూమురిపాల కాలక్షేపాలతో  ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే హాయిగా నవ్వుతూ మరికొన్నాళ్ళు కాలంగడుస్తున్న సంగతేమరచిపోయింది.

     మెల్లగా  మళ్ళీ ఒంటరైపోతున్న భావన. ఆరోగ్యంకూడా దెబ్బతిన్నది. తననొకరు అనుక్షణం కనిపెట్టుకుని ఉండాల్సిన సమయంలో.  . తనతోడు రెట్టించిన ఉత్సాహంతో ఊపుతో వ్రుత్తిలో మునిగి అదే జీవితమనే భ్రమలోవుంటూ పనులచుట్టూ పరిభ్రమిస్తుంటే చూస్తూ నిస్సహాయగా,బేలగా నిలబడి జీవితప్రయాణాన్ని కొనసాగిస్తూ... ఇదికాదు జీవించడం,ఇదికాదు జీవితమంటే అని  అన్నీ తెలిసిన మనిషికి చెప్పలేక చెప్పీ ప్రయోజనంలేక అలా నిలబడిపోయింది.

    ఒకపువ్వు పరిమళం,ఒకమొక్క మారాకు,మనపూదోటకొచ్చిన సీతాకోకచిలుక వన్నెలు , పసివాని బోసినవ్వులు నడవలేకనడుస్తూ లేస్తూపడుతూ పడేఅగచాట్లు, మనల్నే నమ్ముకుని జీవిస్తున్న ప్రాణులూ, మన పరివారం మంచిచెడ్డలూ, సాయంసంధ్యలోని అందాలూ ఉదయకిరణ అనుభూతులూ పంచుకుంటూ పేపరు వార్తలు చర్చించుకుంటూ ఒకరికొకరుగా సేవలు అందిస్తూ సదానవ్వుతూ ఆరోగ్యంగా వుంటూ జీవించాలనే తపన తప్పుకాదుగా.

   ఓ వనితా నీవు లే . నీవు ఇంకా ఎదగాలి. అన్నీ నేర్చుకుని నేర్పుగాజీవించాలి. అందరినీ ధిక్కరించడమే ఎదగడంకాదు. కుటుంబసభ్యులను మెప్పిస్తూనే నీ ఉనికిని చాటుకో.  కస్టమే కానీ నీవు అనుకుంటే సాధించగలవు. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించగన్ తెలుసుగదా మనకు. అందుకే చిన్నప్పుడే అన్ని విద్యలు,కళలునేర్పించాలి మన చిన్నారులకు. త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా  ఇలాంటివి దాటి  పదండి ముందుకు పదండితోసుకు పదండి పోదాం పైపైకి.