Wednesday 28 June 2017

కీమో.

    కీమో తో మన శరీరం లో ఎన్నో మార్పులు కలుగుతాయి. జుత్తు ఊడి పోతుంది, గోళ్ళు నల్లగా మారతాయి,
   తెల్లరక్తకణాలు తగ్గి పోతాయి. దీంతో వళ్ళంతా నొప్పులు, నీరసం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు
  ఎక్కువగా వుండే టట్లు చూసుకోవాలి. పప్పు,చేపలు, చికెన్, పల్లీలు,నట్స్,పాలు, పాలలో ప్రొటీన్ పౌడర్ వగైరా ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి ఆకులు నీటి లో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆకును తీసి ఆనీటిని
 తాగితే తెల్లరక్తకణాలు త్వరగా పెరుగుతాయట. చేదుగా వుంటాయి ఆకుపచ్చ గా వుంటాయి. రోజూ తాగాలి
 ఈమధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది పొప్పడిఆకుల వైద్యం.

       మొదటి సారి కీమో ఇవ్వగానే కొద్ది రోజుల లోనే తలలో ఏదో చిటపట మొదలవుతుంది. చిరాగ్గా వుంటుంది.
    మెల్లగా దువ్వెనతో కొంచెం కొంచెం జుట్టు ఊడుతున్నట్లు గమనిస్తాము. అలా రెండు రోజుల కు చాలా ఊడి
  మాడు కనిపిస్తుంది.  దానిని చూసి మనసు చెదరనీయొద్దు. ఇక లాభం లేదని మనమే పూర్తిగా గుండు చేయించడం మంచిది. తప్పదు. కొందరు ట్రీట్మెంట్ కన్నా ముందే గుండు చేయించుకుంటారు. తప్పని వాటికోసం
  బాధపడటం ఎందుకు?  మధ్యలో కూడా మరోసారి గుండు చేయిస్తే మంచిది.  కీమో అంటే ఒక్క సారితో పూర్తి
  అయ్యేది కాదు. కొందరికి మూడు వారాలకు ఒకసారి, కొందరికి వారం వారం కేసుని బట్టి డాక్టర్లు ప్లాన్ చేస్తారు.
  కీమోకి కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలు కూడా రాలిపోవడం తో మన మొహం మనకే చూడబుద్ది కాదు.
  అయినా పోరాటం చేయాలి. చచ్చే దాకా బ్రతకాలి గా. గెలిచే దాకా అలుపు లేని సంగ్రామం చేయాలి.
  గెలుస్తాము విజేతలవుతాము ఏమంటారు మిత్రులారా...

Tuesday 27 June 2017

కీమో కాన్సర్ ట్రీట్మెంట్


     కాన్సర్ దశలను బట్టి, వచ్చిన చోటునిబట్టి,తీవ్రతని బట్టి ఆపరేషన్, రేడియేషన్, కీమోఅని మూడు
  విధాలుగా వైద్యం వుంటుంది.
 
  ముందు బ్లడ్ టెస్టు చేయించుకుని అన్నీ సరిగా వుంటే మరునాడు వుదయం ఫుల్ గా తిని నార్మల్ గా
  రోజు వేసుకునే మాత్రలు వేసుకొని వెళ్లి కీమో చేయించుకోవచ్చు. నా కైతే ఇలాగే చేశారు అందరికీ ఇలాగే
  చేస్తారో లేదో తెలీదు.  ముందు ప్రీ మెడిసిన్ ఇసస్తారు ఆ తరువాత కీమో మెడిసిన్ ఇస్తారు. ఇదంతా సెలైన్ ఎక్కించినట్లే వుంటుంది.  కంగారు ఏమీ లేదు. ఆందోళన అవసరం లేదు. ప్రశాంతంగా ముగించుకుని ఇంటికి
 రావచ్చు. మరునాడు కూడా ఏమీ కాదు కాస్త నీరసం.  రెండో రోజు మధ్యాహ్నం నుండి నా కైతే విపరీతమైన
 కాళ్ళ నొప్పులు వచ్చాయి.  నడుము కింద భాగం అంతా నొప్పి. ఇక కాళ్ళకు ఆయిల్ మసాజ్ చేయడం నొప్పి
 మాత్రలు వేసుకోవడం మామూలే. అయినా మూడు నుండి ఏడు రోజులు మాత్రం తగ్గలేదండి నాకు.
 ఆ తర్వాత మెల్ల మెల్లగా రోజు రోజు కు ప్రాణం పోసుకుంటున్నట్లు ఆరోగ్యం కుదుటపడుతుంది.  తొలి మూడు
 రోజులకు ఇచ్చిన మాత్రలతో నాలిక రుచిని కోల్పోయి ఏమీ తినలేక  ద్రవాహారంతోనే గడపడమైనది నాకు.

 కొందరికి ఒకటి రెండు వాంతులూ,మోషన్సో,పైల్సో,నోటి పూతో ఇలాగ ఏదో ఒకటి గానీ  మరోటి కలిసి గానీ
  జరగొచ్చు. కానీ, ఏమీ కాదు. ఇది తాత్కాలికమే అని మనకి మనం సర్దిచెప్పుకోవాలి. ధైర్యంగా వుండాలి.
 మనముందు ఎంతో మంది కోలుకుని చక్కగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వారిని చూసి మనం కూడా ధైర్యంగా
  ఆశగా అలా వారిలాగా ఎప్పుడు తిరుగుతామా అని ఆశావహంగా వుంటూ డాక్టర్లకి సహకరిస్తూ వీలయినంత వరకు నలుగురితో వుంటూ వుండాలి. ఒంటరిగా వుండవద్దు.  కనీసం అలా పక్కింటి కైనా వెళ్లి కాసేపుండి
 కబుర్లు చెప్పుకుని రావడం బాగుంటుంది. మంచి మంచి మందులు, మంచి డాక్టర్లు వున్నారు మనకు. జీవితం
 ఇపుడే ముగిసిపోవట్లేదు. మిత్రులారా అధైర్యపడవద్దు. ప్రతి రోజును ఆనందంగా గడపండి ప్రతి రోజును ఆస్వాదించండి సంగీతం తో. సాహిత్యం తో ప్రక్రుతి తో మీదైన లోకంలో .త్వరలోనే మనమూ మామూలు
 జీవితం గడపుతాము. 

Wednesday 21 June 2017

మా అమ్మ కథ.

 
      ఆమెకి 85సంవత్సరాలు. గత సంవత్సరకాలంగా ఆమెకి మతిమరుపు వచ్చింది. పాతవిషయాలన్నీ గుర్తు కున్నాయి కానీ ఇప్పుడు మనమేంచెప్పినా వెంటనే మరచి పోతున్న ది .ఒకే ప్రశ్నని పదేపదే అడుగు తున్నది.  ఇల్లంతా సర్దుదామంటది. సరే అని వెళ్తే పనికిరాని సామానంతా పక్కనబెడితే అవన్నీమళ్లీ లోపల పెట్టేస్తుంది.  చిన్న గుడ్డపీలిక కూడా దాచిపెడుతున్నది.  ఏవస్తువు తనకి నచ్చినా చిన్నగా తీసుకెళ్లి తన రూంలో దాచిపెడుతున్నది.
తన బట్టలు కూడా ఎవరో తీస్తారని వాటిని ఒక బ్యాగులో పెట్టి దాన్ని మరో బ్యాగులో పెట్టి జిప్ లాగి గట్టిగా ముడి వేసి  దాని మీద శద్దరు,పైన టవలుకప్పి కబ్బోర్డు మూసి ఆపైన చిన్న నిచ్చెన నిలబెట్టి, రెండు కుర్చీలు అడ్డంగా పెట్టి
తలుపు వేసి ఇక ప్రశాంతంగా బైటికి వస్తుంది మాఅమ్మ. మచ్చుకు ఇదొకటి మాత్రమే ఇంకా ఇలాంటివి ఎన్నో.