Friday 21 April 2017

పడమటర్ర.

   
     తాత,అమ్మమ్మలకు ఒక్కతేకూతురు అమ్మ .ఒకేఊరు. అమ్మమ్మ వాళ్ళిల్లు పాతబజారులో
    మాఇల్లుకొత్తబజారులో రోడ్డుకు దగ్గరగా వుండేది. వంటంతా ఇక్కడే. అమ్మమ్మ,తాతయ్యలు పొద్దున్నేచెలక,పొలం వ్యవసాయంఅంటూ వెళ్ళేవారు. వారికి సద్దిగిన్నెలు అన్నయ్యో,నేనో జీతగాళ్ళో
   తీసుకెళ్ళేవాళ్ళం.  సాయంత్రం కూడా సద్దిగిన్నెలు మాఇంట్లోంచి అమ్మమ్మ ఇంటికితీసుకెళ్ళేపని
   ఎక్కువగా నాకే వుండేది. ఆటైంలో నేనుఐదోతరగతో ఆరోతరగతో చదివేదాన్ననుకుంటా. అక్కడికి
   వెళ్లాలంటే చాలా వుత్సాహంగా వుండేది.

     అమ్మమ్మ పడమటర్రలో(గదిలో)బెల్లంకుండ వుండేది. మాకుతిరిగివచ్చేటపుడు చేతిమీద అరచేయి
    వెనుకవైపు నిమ్మకాయంత బెల్లం పెట్టి పంపేది. అదినాకుతూనాకుతూమాఇల్లు చేరేదాన్ని. అపుడపుడు
    అక్కయ్య కూడా తోడుగా వుండేది. ఆగది చీకటిగా గబ్బిలాలవాసనతో ఒక్కకిటికీ కూడాలేకుండా
     వుండేది. తడుముకుంటూ వెళ్లి బెల్లంకుండ ఎక్కడవుందీ కనిపెట్టేవాళ్ళం. మాతాతయ్య ఆయనజన్మించినసంవత్సరం(పింగళి) జన్మనామం వగైరా కాగితాలు,భూమికొన్న కాగితాలు ఎక్కడ
   ఎలా దాచేవారో తెలుసా ? లావాటి వెదురు కర్రల కణుపుల దగ్గర కట్ చేసి ఈకాగితాలు రోల్లాగా
   చుట్టి అందులో దూర్చి దానిపైమరో వెదురుబుర్ర తొడిగేవాడు. అందులో పేపర్లు వుంటాయని ఎవరూ
    ఊహించలేం కదా.
  
    ముఖ్యమైన సామానులన్నీ పడమటర్రలలోనే భద్రపరిచేది అమ్మమ్మ. గదినిండా కుండలూ,బానలూ,
    బస్తాలే . ధాన్యం, పప్పులు,బియ్యం,వడ్లు,ఉప్పుబస్తాలు,బెల్లంబుట్టలు,వేరుశనగలు,గోగునారతాళ్ళు,
     పశువులకు సంబంధించినసామాన్లు,పెద్దబోషాణం అందులోకొన్ని పట్టుచీరలు డబ్బులు ఇలా ఒకటేమిటి
    చీకట్లోఆగదిలోకెళ్తే కాళ్ళకువేళ్ళకు ఏవో తగుల్తూనే వుండేవి. దాదాపు 50 సంవత్సరాల గతం నామదిలో
    సజీవంగా నిక్షిప్తమై అపుడపుడు మలయమారుతంలా పలకరిస్తూనే వుంటుంది ఇలాగ.

No comments:

Post a Comment