Thursday 12 October 2017

చిలిపి ఊహ.


    చెలీ  లేలేత సూర్యకిరణాలు తనువంతా స్పర్శిస్తూ ఆస్వాదిస్తూ నీవైపు నన్ను లాగుతున్న బలీయమైన
కారణమేదో తెలుసా?  షటిల్ ఆడుతున్న నన్ను నీవు ఒక్క సారైనా చూసి హాయ్ చెబుతావేమోనని చెమటలతో తడిసిన నామేను నీ పలకరింపుతో తడారిపోతుందని ,నీ రంగు పులిమిన అధరాలలోంచి వినీవినపడని
పదాలేవో అలా అలా అలవోకగా తేలి నావైపు పరుగులతో వస్తుంటాయని ఎంత ఆశగా వున్నానే...

   మొన్నామధ్య కలిసినప్పుడు ఎన్నిబాసలు చేసావు. ఎన్ని కబుర్లు చెప్పావు.  వారంలో ఒక సారైనా
బైట అలా చెట్టాపట్టాలేసుకుని తిరగాలని అనలేదూ!  ఒక సినిమా ఐనా చూద్దామని చెప్పలేదూ.  కాఫీడేలో
కాఫీతాగుతూ కబుర్లతో కాలక్షేపం చేస్తూ గడుపుదామని బాస చేయలేదూ.  ప్రియసఖీ అవన్నీ వట్టి మాటలేనా
నీటి మీద రాతలేనా  మరి నేనేమిటిలా  పిచ్చిదానిలా ప్రతిరోజూ నీవేదో నాకోసం పరితపిస్తున్నట్లుగా ఇలా
భ్రాంతి కలుగుతున్నదేమి?  ప్రేమంటే ఇద్దరికీ ఒకేసారి ఒకే భావన కలుగుతుంది అంటారుకదా !  నీకేమీ
లేదా  దేవుడా ! నాకెందుకిలా. 

   ఒక్క సారైనా ఒక్క రోజైనా ఆతలుపు తెరుచుకుంటుందని, కిటికీ ప్రక్కన వేచి చూస్తున్న నన్ను చూసి
ఆనందంతో గెంతులేస్తావని ఎన్ని ఊహలతో ఎన్నెన్ని జ్ఞాపకాలతో ఎంతకాలమని ఎదురుచూడను?
  ప్రియతమా! అయినా  అయినా నీపై నాకెందుకు కోపం రావడంలేదు తెలుసా?  నాలో వున్న ప్రతిభను
 నీవు మాత్రమే గుర్తించావని . దూరం నుంచే ఒక్క చిరునవ్వు, నీకరచాలనము, భావోద్వేగపూరిత
 వీక్షణం నీగవాక్షమునుండి నేనాశించడం నేరమా  కాదు కానేకాదు ఎవరెన్ని చెప్పినా నామనసు మొరా
యిస్తున్నది.  నిన్నువదిలి రాలేనంటున్నది మరిఎలా?

  అందుకే ఈపత్రలేఖనము. ప్రతి రోజూ నీఇంటివైపే చూస్తూ భావలోకాల్లో విహరిస్తూ ఎడబాటు భరిస్తూ
 అక్షరాక్షరాల్లో జీవిస్తూ... దేశదేశాలు దాటిన నాచెలి రాకకై  చకోరపక్షిలా..... నీ   మనోమంజరి.

No comments:

Post a Comment