Monday 20 June 2016

యోగా దినోత్సవం.

యోగా  ప్రాణాయామం   ధ్యానం.    ఈమూడింటిమధ్య సమతుల్యత వున్నట్లయితె ఇక మనకుఎదురు లేదు.మనం ఏం మాట్లాడుతున్నామో అది చేయడం, ఏం చేస్తున్న మో అదిచెప్పడం , ఏం చెప్తున్నామో అది చేయడంవుంటూ జీవితాన్ని  స్వఛ్చంగా నిర్మలంగా వుంచుతుంది.

       ఆధ్యాత్మికత కోసం చేసినా  శారీరక దారుఢ్యం కోసంచేసినా,మానసిక ప్రశాంతత కోసం చేసినా వ్యాధులను తరిమి కొట్టడానికి చేసినా  ఇది మనకు ఎంతగానో ఉపకరిస్తుంది.ఇది సాధన చేస్తున్న పది రోజుల నుంచే మీకు మెలమెల్లగా గోచరమౌతుంటాయి కావాల్సిన అనుభూతులు.

      యోగాసనాలతో  మన శరీరాన్ని చక్కని ఆకృతిలో వుంచగలుగుతాము.ఊబకాయం,మోకాళ్ళ నొప్పులు, భుజం మెడ కళ్ళు ఇలా ఒకటేమిటి ప్రతి భాగానికి యోగాతో చికిత్స చేయవచ్చు. మన పతంజలి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో చెప్పిన యోగ చికిత్స ద్వారా మందులు వాడకుండా అన్నీ నయం చేసుకోవచ్చు.

       ప్రాణాయామం ద్వారా మెదడులో ఆక్సిజన్ పరిమాణం పెరిగి శరీరంలోని ప్రతి కణంలో ఒక నూతన ఉత్తేజం ఉరకలేస్తుంది.ద్వైదీ భావంతో ఊగిసలాడుతున్న మనసు సరైన ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా చేయగలం అనే ధీమానిస్తుంది. నిరాశా నిస్పృహలతో వున్న మనిషి  పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేస్తే  జీవితాన్ని చాలించాలనుకున్నవారు కూడా  నేనెందుకు చావాలి  తుదిదాకా పోరాటం చేద్దాం అనే చాలెంజింగ్ మైండ్ సెట్ వస్తుంది. అందుకే స్కూల్ పిల్లలకు, జైలులో ఖైదీలకూ,గవర్నమెంట్ ఆఫీసుల లో యోగా నేర్పిస్తున్నారు.ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకుంటున్నాయి .

        ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా వుంటుంది. నేటి జీవనవిధానం వల్ల ఎన్నో వత్తిళ్లు ఎదుర్కొంటునారు.ధ్యానం చేసినంతమాత్రాన వత్తిళ్లు ఎక్కడికీ పోవు.కానీ   వాటిని ఎదుర్కొనే మానసిక ధైర్యం     ధృఢత్త్వం  అలవడుతుంది. నేర ప్రవృత్తి  తొలగించబడుతుంది.ఎవరైనా మాటలతో రెచ్ఛగొట్టినా అది వారి మూర్కత్వంగానే భావించగలుగుతాము. భావోద్వేగాలు నియంత్రించబడతాయి. ముఖంలో ఏదో తెలియని కాంతి,నిర్మలమైన మనసు మానసిక పరిపక్వత సాకారమౌతాయి. కక్ష్యలు  కార్పణ్యాలు, ఆవేశాలు,రక్తపోటులు దూరమై మనిషిని మనిషి ప్రేమిస్తాడు. మన చుట్టూ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది.

       ఇది సాధన చేయడానికి ఎలాంటి ఆలోచన వద్దు. కుల మత,వర్గ, వయో,లింగ భేదం లేకుండా ప్రతి వాళ్లు వీటిని అనుసరిస్తే చక్కని ఆరోగ్య వంతమైన పౌరులు కాగలరు. కేవలం ఇవి ఒక మతానికి సంబంధించినవే కాదు  ప్రతి వాళ్లు చేసి మనసును అదుపులో వుంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకొని తద్వారా దేశాన్ని సుసంపన్నం చేయగలుగుతారు. ఒక నెలపాటు రోజూ ఉదయం  సాయంత్రం ముప్పై నిమిషాలు ఒకే టైం లో చేసి మీ అనుభూతులను మీరే బేరీజు వేసుకోండి తెలుస్తుంది.


   శాంతి శాంతి శాంతి.  ప్రపంచ శాంతి వర్దిల్లాలి.

No comments:

Post a Comment