Tuesday, 27 December 2016

అమ్మా వనితా

!   
     అమ్మంటే. దేవత.ఈ పదంచాలదు  ఇంకా ఇంతకన్న విలువైన పదమేలేదా తెలుగులో .వెదకాలి!పుస్తకాల్ని తిరగేసి నిఘంటువుల్ని తిరుగతోడి,భాషాప్రవీణుల్ని సంప్రదించి ఆమెకు సముచిత సర్వోన్నత సగౌరవ పదం నేను పట్టుకోలేకపోయాను.

      నిస్వార్థజీవి  ఒంటరిపక్షి. ప్రేమతో తనపరివారాన్ని సంరక్షించుకొంటున్న ధీర. భర్త కోసం తల్లిదండ్రుల్నీ,అత్తమామల్నీ,బంధుమిత్రుల్నీ ,చిన్ననాటినేస్తాలైన కోళ్ళూ,కుక్కలూ,ఆవులూ చెట్లూ,పూలూ పళ్ళూ,లతలూ వీటితో తనకున్న బంధాలన్నీ త్రెంచుకుని కుసుమకోమలమైన హ్రిదయాన్ని కఠినంగాచేసుకుని ఆయన వెంట ఎంతోదూరం సునాయాసంగా వెళ్ళగలిగింది. ఇవన్నీ,వీరందరినీ వదిలి అల్లంతదూరాన ఎలావుండగలిగింది?  బహుశాఆతను అత్యంత ప్రేమగా చూసుకున్నాడేమో! వాటన్నింటినీ మరపించేంత మురిపించాడేమో.

     పిల్లలు   తన బుల్లి ప్రపంచంలోకి వచ్చాక ఇక జీవితంలో మరేమీ అక్కరలేదన్నంతగా వారిని పెంచేక్రమంలో తన అస్థిత్వాన్ని కోల్పోయినవైనం కూడా పట్టించుకోనంతగా మునిగిపోతుంది. లాలన పాలన,చదువులూ నిద్రలేనిరాత్రులూ  కోడి తన పిల్లల్ని రెక్కలలోదాచుకున్నట్లుగా తను పెంచుకున్నది. జీవితమంతా ఇలాగే తన కనుసన్నలలోనే వుండాలనుకుంటుందా పిచ్చిది. లోకంలో ఎలా జరుగుతోందో చూస్తూ కూడా తన ఇంట్లోఅలా కాదనే ఆశతోవుంటూ  పిల్లలమీద ప్రేమ చివరకు దేవుణ్ని,మాంత్రికుల్నీ,బాబాలను అందరినీ వేడుకుంటూ ఇక వారికి ఏఆపదా రాదన్న భరోసాతో పెంచుకుంటుంది.

     కాలం మనకోసం ఆగదుకదా! పెళ్ళిళ్ళు చేయాలి కని ఊరుకుంటే సరిపోదు ప్రయోజకుల్నీ చేయాలి మన పరిధుల్లో. ఆక్రమంలో మళ్ళీ తననుతాను మర్చిపోయి బాధ్యతలను అనుక్షణం గుర్తుచేసుకుంటూ వాటిని నెరవేర్చేటందుకు అహరహం శ్రమిస్తూ పూర్తిచేస్తుంది. ఆనక విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా రెండోతరం ఆటా పాటా ముద్దూమురిపాల కాలక్షేపాలతో  ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే హాయిగా నవ్వుతూ మరికొన్నాళ్ళు కాలంగడుస్తున్న సంగతేమరచిపోయింది.

     మెల్లగా  మళ్ళీ ఒంటరైపోతున్న భావన. ఆరోగ్యంకూడా దెబ్బతిన్నది. తననొకరు అనుక్షణం కనిపెట్టుకుని ఉండాల్సిన సమయంలో.  . తనతోడు రెట్టించిన ఉత్సాహంతో ఊపుతో వ్రుత్తిలో మునిగి అదే జీవితమనే భ్రమలోవుంటూ పనులచుట్టూ పరిభ్రమిస్తుంటే చూస్తూ నిస్సహాయగా,బేలగా నిలబడి జీవితప్రయాణాన్ని కొనసాగిస్తూ... ఇదికాదు జీవించడం,ఇదికాదు జీవితమంటే అని  అన్నీ తెలిసిన మనిషికి చెప్పలేక చెప్పీ ప్రయోజనంలేక అలా నిలబడిపోయింది.

    ఒకపువ్వు పరిమళం,ఒకమొక్క మారాకు,మనపూదోటకొచ్చిన సీతాకోకచిలుక వన్నెలు , పసివాని బోసినవ్వులు నడవలేకనడుస్తూ లేస్తూపడుతూ పడేఅగచాట్లు, మనల్నే నమ్ముకుని జీవిస్తున్న ప్రాణులూ, మన పరివారం మంచిచెడ్డలూ, సాయంసంధ్యలోని అందాలూ ఉదయకిరణ అనుభూతులూ పంచుకుంటూ పేపరు వార్తలు చర్చించుకుంటూ ఒకరికొకరుగా సేవలు అందిస్తూ సదానవ్వుతూ ఆరోగ్యంగా వుంటూ జీవించాలనే తపన తప్పుకాదుగా.

   ఓ వనితా నీవు లే . నీవు ఇంకా ఎదగాలి. అన్నీ నేర్చుకుని నేర్పుగాజీవించాలి. అందరినీ ధిక్కరించడమే ఎదగడంకాదు. కుటుంబసభ్యులను మెప్పిస్తూనే నీ ఉనికిని చాటుకో.  కస్టమే కానీ నీవు అనుకుంటే సాధించగలవు. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించగన్ తెలుసుగదా మనకు. అందుకే చిన్నప్పుడే అన్ని విద్యలు,కళలునేర్పించాలి మన చిన్నారులకు. త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా  ఇలాంటివి దాటి  పదండి ముందుకు పదండితోసుకు పదండి పోదాం పైపైకి.

Tuesday, 1 November 2016

క్రిష్ణమ్మ

     ఎప్పటిదానవమ్మా నీవు! శాతవాహన రాణుల కుచకుంకుమల సౌరభంలో సహస్రాబ్దాల క్రితం పరవశించిన మూర్తివేనా?    ధరణికోట ప్రభువుల యుధ్ధనౌకలను చుంబించిన వేయేండ్లనాటి అమరమూర్తివేనా నీవు..

     బౌధ్ధ సన్యాసినీగణ స్నానఘట్టమై చరిత్రలో చెరుగకనిలిచిన దివ్యమూర్తివేనానీవు.  నాగార్జున పాదస్పర్శతో పరుసవేదిగా మారిన భవ్యమూర్తి నీవేనాతల్లీ! అమ్మా! క్రిష్ణమ్మా! ఎందరి కవిరాజుల గుండెలగలగలలో ఇవి. ఎందరు సీమంతులు వాడిన జలకపు పరిమళమో ఇది! 

      కోకిలలకు కాలపు నిబంధనలు లేవు. శారికలకూ,కీరాల కలరుతాలకూ చీకటివెలుగులు లేవు. పండి రాలిన పళ్ళను జలపక్షులు ఒడ్డుకువచ్చి ఏరుకుతింటాయి ఎల్లవేళలా. పామో-చేపో కూడా తెలియని పొడవాటి జలచరం మెడనిక్కించి మానవుణ్ని పలకరిస్తుందిక్కడ. మూరెడు తెప్పకొయ్యతో చేపలతో పోటీపడి కాపుపిల్లలు ఆవలిఒడ్దుకు పాకుతూ పోతారు నీళ్లల్లో.




(ఇది నా చిన్నప్పుడు చదివిన నవలలోనిది.బహుశా లల్లాదేవి రచనలోనిది అనుకుంటున్నాను.మా నాన్నగారు చాలా నవలలు, అపరాధపరిషోధన సిరీస్ , గోర్కి అమ్మ,చలం రచనలు,శరత్ రచనలు ఇలా చాలా తెచ్చేవారు. అపుడు నాకు నచ్చి నా నోట్స్ లో రాసిన వాక్యాలు ఇవి)

Saturday, 27 August 2016

మాఇల్లు మాచెట్లు.

   
   నల్గొండ జిల్లా,తుంగతుర్తి నియోజకవర్గం, మండల్ నూతనకల్ మాఊరు.మానాన్న,మామామయ్య,మాఅత్తయ్య ముగ్గురూ ఆ స్కూలులో టీచర్లు..ఆస్కూలు పక్కనే మాఇల్లు.

   నా చిన్నప్పుడు1970లలో మాఇంటిముందు యూకలిప్టస్,సన్నజాజి,కాగితంబఠాణీ    ఇంటిప్రక్కన కరివేపాకు,జామ,బొప్పాయి...అటుప్రక్కన నిమ్మ,బత్తాయి,దానిమ్మ,సీతాఫలం,బొడ్దుమల్లె,వేపచెట్లు,దొబ్బనిమ్మచెట్లు పెద్దగా పెరిగి మాకు నీడనిచ్చి. తోడుగా నిలిచాయి.మాతాతయ్య పెట్టించాడట ఆచెట్లని.

   పెద్ద ఇల్లూ స్కూలు పక్కనే ఉండటం,నాన్న టీచరూ,మాఇంట్లో కరెంటూవున్నందున నా ఫ్రెండ్స్,అక్కయ్య ఫ్రెండ్స్,అన్నయ్య ఫ్రెండ్స్ ఇంట్లో చాలా మందే ఉండి చదువుకునేవారు.జామచెట్టు కొమ్మలపై తలాఒకవైపు ఒరిగి బట్టీపట్టేవాళ్లం పాఠాలని.ప్రశ్నలకు జవాబులు ఒకరికొకరంఒప్పగించుకునేవాళ్లం. జామ లేతచిగురులో చింతపండు కలిపి నోట్లో పెట్టుకుని అలా చప్పరిస్తూ ఆనందించేవాళ్లం.

    నిమ్మచెట్టుకింద ఊడ్చి చాపలేసుకుని కూర్చుని కథలూ  కబుర్లూ చెప్పుకునేవాళ్లం.మధ్యాహ్నం రెండు మూడు గంటలసేపు ఇలా గడిచేది ఆదివారాల్లో,సెలవుల్గో. తుమ్మజిగురు తీసి ఒక సీసాలో దాచుకునేవాళ్లం.అగరుబొట్టు తయారు చేసేవాళ్లం.బొడ్డుమల్లె చెట్టుచుట్టూ తిరుగుతూ తెలుగుపద్యాలు కంఠస్తం చేసేవాళ్లం.పూరెక్కలు ఒక్కొక్కటి తీసి కాస్తనలిపి గాలిఊది ఎదుటివారి నుదుట చిటుక్కునకొట్టి టప్మనే శబ్దం రాగానే నవ్వుకొనేవాళ్లం.

    మాఇంటి ప్రాంగణంలో ఉప్పుబేరలు ఆడటం,ఇంటివెనుక ఒకగ్రూప్,ఇంటిముందు ఒకగ్రూప్ ఇసుకతో సన్నాయికుప్పలు ఆడేవాళ్లం.ఆకులకింద కూడాకుప్పలు పోసేవాళ్లం.లేదంటే బొగ్గుతో చుక్కలుపెట్టేవాళ్లం.

    బోగన్విల్లాపూలు అదేనండీ కాగితంపూలు పెద్దపెద్ద కొమ్మలుగా పూసేవి .వాటిని విరిచి మాతాతయ్య రుమాలులో తనకు తెలియకుండాగుచ్చేదాన్ని.చెలక దగ్గరకి అలా వెళ్తుంటే దారిలో అందరూ నవ్వుతుంటే గాని తెలిసి నవ్వేవాడట. రుమాలులో ఇంటికి వచ్చేటప్పుడు మాకోసం ఈత పళ్లు తెచ్చేవాడు.

    యూకలిప్టస్ ని అప్పుడు జమాయిల్ చెట్టు అనేవారంతా.ఊరంతటికీ ఒక్కమాఇంట్లోనే ఉండేదిఆచెట్టు.దాని ఆకులకై అందరూ మాఇంటికి వచ్చేవారు. పంటితీపు,తలనొప్పి,మాడుపోటుకు దీనిఆకులు వాడేవారు. మాతమ్ముడైతే పైసా రెండుపైసలకు అమ్మేవాడు.ఆపిల్లలు ఎందుకు కొనేదో ఇప్పటికీ అర్థం కాదు.

    ఇలా ఒక్కోచెట్టుతో నా అనుబంధం ఒక్కోకథలా నామదిలో నిక్షిప్తమైంది.ఆ ఫ్రెండ్స్ లోఒక కుటుంబమే తదుపరి నా కుటుంబమవడంతో అపుడపుడూ గుర్తుచేసుకుని ఆనందిస్తాము.చెట్లతో నా అనుబంధం మీతో పంచుకోవాలనే కోరిక రోజురోజుకూ పెరిగి ఇలా మీముందు పొందుపరిచాను.

Thursday, 4 August 2016

మానసి

         చిట్టితల్లీ ఎక్కడపుట్టావు ఎక్కడికి చేరావు.ఇది నీ అద్రృష్టమా లేక నాదా.  నీచిన్నిచేతులతో నా కెన్ని పనులు చేయాలని వచ్చావే.బహుశా నీకు తెలీదు లో కం పోకడ.అమ్మ నీడలొంచిదూరం పోతే లోకమెంత ని ర్దయురాలో

       ఎనీమియాతో వున్న నీచేతులు చల్లగా నా నుదురుపై అమృతాంజన్ రుద్దుతూంటే ఎంత హాయిగా వుందే నాకు. ఆటలాడి వచ్చిన నా కాళ్ల నొప్పులకు నీ మృదుకరస్పర్శతో విశ్రాంతి నిచ్చావు.

       ఎవరూ లేరని ఒంటరిగా కుములుతున్న నన్ను నేను లేనా అమ్మా  అంటూ ఎదురు ప్రశ్న వేశావు.విధి చేతిలో మేము విలవిల లాడినపుడు మౌనంగా మాకు ఆలంబనవైనావు.

      స్థబ్దంగా నడుస్తున్న మా జీవితాలలో నీపద మువ్వల సవ్వడితో జీవం పోసావు. అలసి సొలసి నిర్వేదనకు లోనైనపుడు నీ అమాయకపు నవ్వులతో మైమరపించావు.

       నా శ్వాస లో నా ధ్యాసలో నా ప్రతి కదలిక లో నా తోడువై నీడవై వున్న నీకు ఏమివ్వను తల్లీ నీ రుణమెలా తీర్చుకోనే నా మానస పుత్రీ.

Monday, 11 July 2016

వుదయపు ఉషస్సు

మబ్బులు పోలేదు వెచ్చని సూరీడు రాలేదు .అప్పటికి అరగంట నుండి అదే గట్టు పై కూచుని అటుగా చూస్తూ కవితా లోకంలో విహరిస్తూ ఇలా ... 
          
        చల్లని వాతావరణం కాశ్మీరాన్ని తలపిస్తోంది .పచ్చని పచ్చిక మెత్తని తివాచీలా సుతారంగా కాళ్ళను తాకుతూ హాయి గొల్పుతూంది .నిషా చరాలన్నీ మెల్లగా తమతమ తావులలో తల దాచుకుంటూ న్నాయి .ఉశోదయానికి స్వాగతమంటూ శుక పిక శారికలు పరవశంతో కూని రాగాలు తీస్తున్నాయి .

       ప్రక్కనే చిరు తటాకమున ఓ తుంటరి విసిరిన రాయికి సుడుల తరంగాలు తిరుగాడుతున్నాయి. సుదూరంగా
రహదారిపై వెళ్ళే వాహనాల బారులు మందకొడిగా సాగుతున్నాయి .ఆవల ఎతైన భవన సముదాయాలు అంబరాన్ని చుమ్బించాలని తెగ ఆత్రుత పడుతున్నాయి .

       చెరువు గట్టున చిన్న దేవాలయం నుండి భక్తి గీతాలు ఆధ్యాత్మిక  ప్రశాంత వాతావరణాన్ని నలు దెసల పరి వ్యాపితం చేస్తూ వీనుల విందు గావిస్తున్నాయి .చిన్న పిల్లల్లా తుళ్లుతూ ఆట కోసమయి వస్తూ  బ్యాటూ బ్యాగులతో  విన్యాసాలు  చేస్తూ  ముచ్చటిస్తూ ఒకరొకరుగ  క్రీడా ప్రాంగణం లోనికి  వెళుతున్నారు  మిత్రులు .

     దారికి ఇరువైపుల లేతపచ్చని  పోక చెట్లు వారికి ఆకులు కదలిస్తూ  వందనాలతో స్వాగతం పలుకుతున్నాయి .పార్క్ చుట్టూ సైనికుల వలే నిటారుగా నిలిచిన పొగడ చెట్ల వరుసలు -వాటి కింద  రాలిన పూలూ ఏదేవుని పూజలకో 'ఏ ఇంటి అలంకారాలకో ఎదురు చూస్తున్నాయి .

       లలితా లలితమైన పేరు తెలీని చిన్ని చిన్ని పూవులు  విరగ బూస్తూ పరిసరాలకు వన్నె తెస్తున్నాయి .సేతువు  నిర్మించిన నాటి  ఉత్సాహం తోనేమో  ఉడుతలు  ప్రాకారం మీదుగా  పరుగు పందాలు పెట్టుకుని  లిప్త పాటులో మాయమయినాయి . నల్లని పిచ్చుకలు అల్లనల్లన ఎగురుతూ  దిగుతూ తుషార బిన్దువులతో  మెరిసే గడ్డి పరకలపై సయ్యాట లాడుతూ కను విందు  చేస్తున్నాయి .

       ఇంతలోనే పిల్ల తెమ్మెరలు ఒకటొకటిగా వస్తూ విరి పరిమళాలు  మోస్తూ  పులకింతలు పెడుతున్నాయి .
కొండొకచో కా పల దారులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ  రెప్ప వాల్చకుండా  గమనిస్తూ  ఉషోదయాన  హుషారుగా తిరుగాడుతున్నారు . పచ్చిక మధ్యలో దారిని చూస్తే కొండచిలువలా  మెలికలతో  కానవస్తున్నది .

      ఓమూల  ఆట స్థలంలో ఉయ్యాలపై నొక ముదిమి అదేపనిగా ఊగుతూ బోసి నవ్వులతో మైమరచి పొతూన్ది .ఆపక్క గనుమ గుండా వచ్చి పిల్లలకు తినిపిస్తూ  గట్టుపై కూర్చుని  గుంపుగా మురిసిపోతున్నారు ఆఇంటి వాళ్ళు .

       అక్కడక్కడ ఉదయపు  నడకలతో  కొందరు బద్దకంగా కదలుతూ  తాబేలుని తలపిస్తున్నారు .మరికొందరేమో  వడివడి నడకలతో ఎదో సాధించాలనే ఆత్రుతతో పరుగులు పెడుతున్నారు .ఆకొమ్మపై రెండు గండు కోయిలలు కొమ్మకొమ్మను వాలుతూ -పాడుతూ సరగాలాడుతూ ప్రపంచాన్ని  మరచినట్లున్నాయి .

       ఆ గవాక్షము నుండి ఎదురు చూసినగాని ప్రియసఖికి  నేనేల మరుపైతిని .విసిగి వేసారి నా మనసేమో నా మీద తిరుగుబాటే మారు మాటైతిని .ఆకు పూలూ బెరడు  పోడులతో  కుస్తీ పడుతూ  కాలాన్ని మరచి  కషాయాన్ని కాస్తున్నాడో పెద్దమనిషి  అనుభవ సారాన్నంతా  రంగరించి .

       ఆ పచ్చిక  బయళ్ళలోని  బెంచిలపై ఆడి అలసిన  చెమటల  వొళ్ళు  ఆరబెడుతూ  ఏవో  పిచ్చాపాటి  మాట్లాడుతూ  కొందరు , చెవులకు చెరవానితో  కొందరు ,ఒకరిపయి నొకరు చెణుకులు  విసరుతు  మరి కొందరున్నారు .ఆకాశంలో  సగం మేమంటూ నిద్దరు  వనితలు  నినదించి ,నీరసించి  సేద దీరుతున్నారక్కడ .

       దవ్వులలో నొక జంట  పంపే  పానీయ  సేవనానికయి  ఎదురుచూస్తూ  రచ్చ బండ దగ్గర  చర్చోపచర్చలు  సాగిస్తూ  కాలయాపన  చేస్తున్నారు అతిరధమహారదులంతా . ఇక  వెళదామా అంటూ  వినిపించేసరికి తటాలున  లేచి ఇంతటి  ఆహ్లాదాన్ని వదలి  నేనేల రావలేనింటికి ?అనునాత్మ ఘోష నదిమి గృహోన్ముఖ రాలనయతిని .

Thursday, 23 June 2016

సౌగంధి

నేనచటి కొస్తున్న వార్త నెట్లుతెలుసుకొనెనో మండు వేసవిలో తన సహజ ఉష్ణ నైజమునొదిలి సుదూర ప్రాంతాల తరలి  వచ్చిన పిల్ల గాలులు నన్నావహించి సాదరముగా ఆహ్వానించెనకటా ఇది ఏమి బాంధవ్వమో.


       మనసు పొరలలో దాగిన చెలిమి చెలమల నుండి ఆనాటి ముచ్చట్లు అంచెలంచెలుగ తోడుతున్న నా మది నెట్లుఊరడింతునిది కొంత సమయమే కానిఅధికముగా నేనుండజాలనని.

       భద్రాద్రి రామయ్య గలగలాగోదారి పసిడికాంతుల జనపచేలు,భుక్తినిచ్చిన నల్లబంగారు సింగరేణి,గోదారి గుసగుసల పైరగాలులనెట్లు మరచెదనో  మనసున్న మనిషినే ఓ నేస్తమా.

Monday, 20 June 2016

యోగా దినోత్సవం.

యోగా  ప్రాణాయామం   ధ్యానం.    ఈమూడింటిమధ్య సమతుల్యత వున్నట్లయితె ఇక మనకుఎదురు లేదు.మనం ఏం మాట్లాడుతున్నామో అది చేయడం, ఏం చేస్తున్న మో అదిచెప్పడం , ఏం చెప్తున్నామో అది చేయడంవుంటూ జీవితాన్ని  స్వఛ్చంగా నిర్మలంగా వుంచుతుంది.

       ఆధ్యాత్మికత కోసం చేసినా  శారీరక దారుఢ్యం కోసంచేసినా,మానసిక ప్రశాంతత కోసం చేసినా వ్యాధులను తరిమి కొట్టడానికి చేసినా  ఇది మనకు ఎంతగానో ఉపకరిస్తుంది.ఇది సాధన చేస్తున్న పది రోజుల నుంచే మీకు మెలమెల్లగా గోచరమౌతుంటాయి కావాల్సిన అనుభూతులు.

      యోగాసనాలతో  మన శరీరాన్ని చక్కని ఆకృతిలో వుంచగలుగుతాము.ఊబకాయం,మోకాళ్ళ నొప్పులు, భుజం మెడ కళ్ళు ఇలా ఒకటేమిటి ప్రతి భాగానికి యోగాతో చికిత్స చేయవచ్చు. మన పతంజలి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో చెప్పిన యోగ చికిత్స ద్వారా మందులు వాడకుండా అన్నీ నయం చేసుకోవచ్చు.

       ప్రాణాయామం ద్వారా మెదడులో ఆక్సిజన్ పరిమాణం పెరిగి శరీరంలోని ప్రతి కణంలో ఒక నూతన ఉత్తేజం ఉరకలేస్తుంది.ద్వైదీ భావంతో ఊగిసలాడుతున్న మనసు సరైన ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా చేయగలం అనే ధీమానిస్తుంది. నిరాశా నిస్పృహలతో వున్న మనిషి  పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేస్తే  జీవితాన్ని చాలించాలనుకున్నవారు కూడా  నేనెందుకు చావాలి  తుదిదాకా పోరాటం చేద్దాం అనే చాలెంజింగ్ మైండ్ సెట్ వస్తుంది. అందుకే స్కూల్ పిల్లలకు, జైలులో ఖైదీలకూ,గవర్నమెంట్ ఆఫీసుల లో యోగా నేర్పిస్తున్నారు.ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకుంటున్నాయి .

        ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా వుంటుంది. నేటి జీవనవిధానం వల్ల ఎన్నో వత్తిళ్లు ఎదుర్కొంటునారు.ధ్యానం చేసినంతమాత్రాన వత్తిళ్లు ఎక్కడికీ పోవు.కానీ   వాటిని ఎదుర్కొనే మానసిక ధైర్యం     ధృఢత్త్వం  అలవడుతుంది. నేర ప్రవృత్తి  తొలగించబడుతుంది.ఎవరైనా మాటలతో రెచ్ఛగొట్టినా అది వారి మూర్కత్వంగానే భావించగలుగుతాము. భావోద్వేగాలు నియంత్రించబడతాయి. ముఖంలో ఏదో తెలియని కాంతి,నిర్మలమైన మనసు మానసిక పరిపక్వత సాకారమౌతాయి. కక్ష్యలు  కార్పణ్యాలు, ఆవేశాలు,రక్తపోటులు దూరమై మనిషిని మనిషి ప్రేమిస్తాడు. మన చుట్టూ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది.

       ఇది సాధన చేయడానికి ఎలాంటి ఆలోచన వద్దు. కుల మత,వర్గ, వయో,లింగ భేదం లేకుండా ప్రతి వాళ్లు వీటిని అనుసరిస్తే చక్కని ఆరోగ్య వంతమైన పౌరులు కాగలరు. కేవలం ఇవి ఒక మతానికి సంబంధించినవే కాదు  ప్రతి వాళ్లు చేసి మనసును అదుపులో వుంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకొని తద్వారా దేశాన్ని సుసంపన్నం చేయగలుగుతారు. ఒక నెలపాటు రోజూ ఉదయం  సాయంత్రం ముప్పై నిమిషాలు ఒకే టైం లో చేసి మీ అనుభూతులను మీరే బేరీజు వేసుకోండి తెలుస్తుంది.


   శాంతి శాంతి శాంతి.  ప్రపంచ శాంతి వర్దిల్లాలి.

నా న్న

               
            నాన్నే నా ప్రక్కన నిలిచి     ప్రతి పదమున తానై నడచి
          
                 నా కనుచివరల నీరయ్ మొలిచి తరగని ఆత్మీయత పరచి

                    నాతల పై తన చేయుంచి అమ్మీ అని నను ముద్దిడుతూ

                      నిమిరే మా నాన్న ఏడంటూ దిక్కు తోచని ఎడారి లోన

                                ఒంటరిగా    నే    నిలుచున్నా.

అమ్మ

ఆది దేవత రా అమ్మ  ఆమె వలదంటే లేదు ఈజన్మా. అమ్మ వున్నా ఇంటిలో లేనిది ఏదీ .అమ్మ అన్నది ఒక కమ్మని మాట .అమ్మంటేనే ఒక భరోసా ఒక హాయీ .ఎన్ని ఉపమానాలూ సరిపోని ఒకే ఒక్క పదం అమ్మ .మాది సూర్యాపేట తాలుకాలోని నూతన్కల్ గ్రామం.అన్నయ్య ,అక్కయ్య,నేనూ ,తమ్ముడు.మా చిన్నప్పుడు దాదాపు 45 ఏళ్ల  క్రితం జ్ఞాపకాలు .నాన్న నాస్తిక భావాలు  కలవాడు .ఏది వద్దనే వాడు .అమ్మకేమో మాకు గాజులు గొలుసులు అన్ని వేయాలని తపించేది.నాన్నకు తెలియకుండా కొని పెళ్లిళ్లకు పేరంటాలకు మాకు వేసేది .మా పెళ్ళిళ్ళలో కూడా అమ్మ పడ్డ సంఘర్షణ మర్చిపోలేను .అప్పటి సామజిక పరిస్థితి,సంప్రదాయాలు ఆచారాలు ఒకవైపు -నాన్న సిదాంతం ఒకవైపు .ఈ రెంటి మధ్య నలిగినా అమ్మను నేను చాల గమనిన్చేదాన్ని .అందుకే అమ్మంటే ఒకింత ఎక్కువ ప్రేమ .నా న్న సహకారంతో  అమ్మ ఊర్లో సర్పంచగా పని చేసి మంచిపేరు తెచుకున్నది .వీధి దీపాలు పెట్టించింది .మహిళామండలి సెక్రెటరీగా బాల్వాడి సెంటర్,కుట్టుమిషన్ సెంటర్ పెట్టించింది .అప్పట్లోనే ఆరోగ్యవంతమైన పాపల పోటీ పెరటితోటల పోటి పళ్ళపొడి తయారు చేయడం నేర్పించింది .నా న్న  ఎక్కువగా  మాట్లాడేవాడు కాదు.అమ్మే అన్ని చూసుకునేది .మా భూములు అమ్మడం పెద్దమనుశులతో మాట్లాడటం డబ్బులు వసూలు చెయడం లాంటి లావాదేవిలన్ని చూసుకునేది .తాతయ్య అమ్మమ్మలు వ్రుధాప్యములో చేరోమంచంలో వుంటే అమ్మ ఎంత సేవ చేసిందో చూసాను .మా   బాధ్యతలన్నీ తీరాయి,అమ్మమ్మ,తాతయ్య పోయారు ,నాన్న రిటైరయ్యారు .ఇక ప్రశాంతంగా వున్దామనుకునేవేల నాన్నకు పెరలసిస్స్త్రోక్ .ఇక అప్పటినుండి దాదాపు 6 సంవత్సరాలు నాన్నని చిన్న పిల్లాడిలాగ తినిపించడం ,మూతితుడవడం ,స్నానం చేయించడం  ఇస్త్రి బట్టలతో పెల్లిల్లకు తీసుకెళ్ళడం వేల్లకు  మందులు వేయడం చేస్తూ ఆది దంపతుల్ల లాగ తిరిగేవారు .అమ్మను చూసి ఎన్నో నేర్చుకున్నాను .ఒక స్త్రీ అంటే ఇన్ని కోణాలు వుంటాయా ఉండాలా అని .ఇంత తెలివి ,సహనం,ఓర్పు ,శ్రమ,ప్రేమ ,వాత్సల్యం ఎన్నొ పార్శ్వాలు కనిపించాయి అమ్మలో .నానన 2000 సంవత్సరంలో పోయారు .పిల్లలం ముగ్గురం సిటీలోనే ఉన్నాము .మా దగ్గర వుండమంటే ఉండట్లేదు .నావంట ,నా పనులు అన్నీ నేను చేసుకుంటూ వున్నాగా ఇప్పుడే మీ దగ్గరికి ఎందుకు వస్తాను అంటున్నది .నాకు చేతగానప్పుడు వస్తాను  అప్పుడు చూస్తాను అంటున్నది .83 సంవత్సరాల వయసులో ఆ మే పట్టుదల,స్వశక్తి మీద నమ్మకం సడలని సంకల్పం మాకు స్ఫూర్తి .అందరూ వుండి అమ్మనలా ఒంటరిగా వదిలమా అని మనసు కష్టంగా ఉంది .ఇది అంతే లేని మా అమ్మ కథ.అమ్మకు తన బాధను చెప్పుకొని ఓదార్పు పొందడానికి ఎవరూ లేరు .అన్నాతమ్ముల్లు ,అక్కాచెల్లెళ్లు లేరు .ఎన్నో సవాళ్ళను ఒంటరిగా ఎదుర్కొన్న ధీశాలి .నా జీవితంలో ఎదురైనా ప్రతి క్లిష్ట సమయంలో అమ్మైతే ఏమి చేసేది అని -అలాగే ధైర్యంతో ముందుకు సాగుతున్నాను .